నేడు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి

జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య 142వ జయంతి నేడు

Updated: Aug 3, 2018, 04:18 PM IST
నేడు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి

జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య 142వ జయంతి నేడు.

పింగళి వెంకయ్య ఆగస్ట్‌ 02, 1876లో కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో జన్మించారు. మచిలీపట్నంలో విద్యనభ్యసించి పైచదువుల కొరకు విదేశాలకు వెళ్లి.. 19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడే తొలిసారిగా గాంధీజీని కలిశారు. ఆతర్వాత వెంకయ్య భారతదేశానికి తిరిగివచ్చి బందరులోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా చేశారు.  

1924-1944 వరకు మైకా (అభ్రకం) గురించి పరిశోధన చేశారు. వజ్రకరూరు, హంపిలలో ఖనిజాలు, వజ్రాలు గురించి విశేషంగా పరిశోధనలు జరిపి బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి 'తల్లిరాయి' అనే గ్రంథం రాసి 1955లో దాన్ని ప్రచురించారు. అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన 'సన్ యత్ సేన్ ' జీవిత చరిత్ర వ్రాశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా నియమించింది.

1913లో జాతీయ పతాక రూపకల్పనకు బీజం పడగా.. 1916లో ‘భారతదేశమునకు ఒక జాతీయ పతాకం’ అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు. 1921లో బెజవాడ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ ఆదేశానుసారం త్రివర్ణ పతాకాన్ని రూపొందించి మధ్యలో రాట్నం గుర్తు చేర్చారు. భారతదేశానికి  స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ సూచనమేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం చేర్చబడింది. ఏప్రిల్‌ 13, 1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. జులై 4, 1963లో 86వ యేట పింగళి వెంకయ్య తుదిశ్వాస విడిచారు.

జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనిషి ఆయన. ఆయనను ప్రజలు మరచిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించింది. భారత తపాలా శాఖ పింగళి సేవలను స్మరించుకుంటూ 2009లో ఆయన ముఖచిత్రంతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. 2012లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మనకందించిన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నంత వరకు ఆయన స్ఫూర్తితో సాగుతాం.. ఇదే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి.. జైహింద్!

 

 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close