తెలుగు టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ నిందితుడికి జీవిత ఖైదు

అమెరికాలోని కన్సాస్‌లో భారత తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌(32)ను కాల్చి చంపిన కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరింటన్‌(52)కు అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది.

Updated: May 5, 2018, 03:40 PM IST
తెలుగు టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ నిందితుడికి జీవిత ఖైదు

అమెరికాలోని కన్సాస్‌లో భారత తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌(32)ను హత్య చేసిన కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరింటన్‌(52)కు అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో తాను నేరం చేసినట్లు ప్యూరింటన్ అంగీకరించాడు. శ్రీనివాస్‌‌ను హత్య చేయడంతో పాటు అతని స్నేహితుడు అలోక్ మాదసాని, తనను అడ్డుకున్న ఇయాన్ గ్రిలాట్‌లపై కూడా ప్యూరింటన్ కాల్పులు జరిపాడు. తాను ఈ  హత్య చేసినట్లు జడ్జి ముందు అతడు అంగీకరించినందుకు ప్యూరింటన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. 165 నెలల శిక్షపై స్పందించిన శ్రీనివాస్ భార్య సునయన.. భర్తను పొందడం అసాధ్యమైనా, అన్యాయం చేసిన వారికి శిక్షపడడం సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు.

ట్రంప్ అధికారంలోకి వచ్చాక స్థానికత వాదం పెచ్చుమీరుతున్న క్రమంలో.. 2017 ఫిబ్రవరి 22న జరిగిన ఈ హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాల్పులు జరిపే 'ముందు మా దేశం నుంచి వెళ్లిపోండి' అని ప్యూరింటన్ అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన అలోక్ మాదసాని ఆ రోజు జరిగిన ఘటనను కోర్టుకు వివరించారు. కాల్పులు జరిపే ముందు ఒకసారి తమ దగ్గరికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడి వెళ్లిపోయాడని అలోక్ చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గన్ తీసుకొని వచ్చి కాల్పులు జరిపాడని తెలిపారు. ఈ ఘటనలో కూచిభొట్ల శ్రీనివాస్‌కు మూడు బుల్లెట్ గాయాలు కాగా.. అతను అక్కడికక్కడే మరణించాడు. అలోక్ కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వాళ్లను కాపాడే ప్రయత్నం చేసిన ఇయాన్ గ్రిలాట్‌కు చేయి, ఛాతీల్లో బుల్లెట్ గాయాలయ్యాయి.