అంబటి రాయుడు కెరీర్ చిక్కుల్లో పడిందా ?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్‌, పార్ట్‌ టైం బౌలర్‌ అంబటి రాయుడు బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారుల నుంచి తమకు ఫిర్యాదు అందినట్టు ఐసీసీ వెల్లడించింది.

Last Updated : Jan 13, 2019, 07:57 PM IST
అంబటి రాయుడు కెరీర్ చిక్కుల్లో పడిందా ?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్‌, పార్ట్‌ టైం బౌలర్‌ అంబటి రాయుడు బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారుల నుంచి తమకు ఫిర్యాదు అందినట్టు ఐసీసీ వెల్లడించింది. సిడ్నీ స్టేడియం వేదికగా  శనివారం జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన రాయుడు 13 పరుగులు ఇచ్చాడు. అయితే, ఈ మ్యాచ్ అనంతరం 'రాయుడు బౌలింగ్‌ యాక్షన్‌ అనుమానాస్పదంగా ఉంది' అని మ్యాచ్‌ అధికారులు ఐసీసీకి ఓ నివేదిక అందజేశారు. ఆ నివేదికను భారత జట్టు యాజమాన్యం బీసీసీఐకి అందించామని ఐసీసీ పేర్కొంది. ఇలాంటి ఘటనలు ఎదురైన సందర్భాల్లో.. ఐసీసీ టెస్టు, వన్డే, టీ20ల్లో అనుమానాస్పద బౌలింగ్‌ యాక్షన్‌ నియమ నిబంధనల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బౌలర్ బౌలింగ్‌ను క్రికెట్ నిపుణుల సమక్షంలో ఐసీసీ పరీక్షించాల్సి ఉంటుంది. అలా రానున్న 14 రోజుల్లోపు రాయుడు ఎప్పుడైనా ఈ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. 'రాయుడు పరీక్ష పరీక్ష ఫలితం వచ్చేలోపు అతడు ఇకపై ఆడబోయే మ్యాచుల్లో బౌలింగ్‌ చేయవచ్చు' అని ఐసీసీ స్పష్టంచేసింది. 

కెరీర్‌లో ఇప్పటి వరకు 46 వన్డేలు ఆడిన అంబటి రాయుడు అందులో కేవలం 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. సగటు 41.33. ఎకానమీ రేటు 6.14. మూడు వికెట్లు తీశాడు. 6 టీ20 మ్యాచ్‌ల్లో అంబటి రాయుడు అసలు బౌలింగే చేయలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌పై మరింత దృష్టిసారించడం కోసం రాయుడు గత నవంబర్‌లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

Trending News