నేడే ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌: రెండోసారి భారత్‌, పాకిస్థాన్‌ ఢీ

పాక్‌ను తక్కువగా అంచనావేయం: కెప్టెన్ రోహిత్ శర్మ

Last Updated : Sep 23, 2018, 01:19 PM IST
నేడే ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌: రెండోసారి భారత్‌, పాకిస్థాన్‌ ఢీ

ఆసియా కప్‌ 2018లో భాగంగా ఆదివారం భారత జట్టు మరోసారి దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది. గ్రూప్‌ దశలో ఢీకొన్న ఇరు జట్లూ.. సూపర్‌-4లో మళ్లీ పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పాక్‌ని చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. తర్వాత శుక్రవారం నాడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా పాక్‌పై కూడా మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని భావిస్తోంది. పాక్ కూడా భారత్‌ చేతిలో పొందిన ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటోంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్‌ బెర్తు దాదాపుగా ఖరారవుతుంది.

భారత్ జట్టు (అంచనా): రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, జస్ర్పీత్‌ బుమ్రా.

పాకిస్థాన్‌ జట్టు (అంచనా): ఫఖర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, బాబర్‌ ఆజమ్‌, షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ (కెప్టెన్‌), ఫహీమ్‌ అష్రా్‌ఫ/హరీస్‌ సొహైల్‌, ఆసిఫ్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌/మొహమ్మద్‌ నవాజ్‌, హసన్‌ అలీ, ఉస్మాన్‌ ఖాన్‌, షహీన్‌ అఫ్రీది/మహ్మద్‌ ఆమెర్‌.

పాక్‌ను తక్కువగా అంచనావేయం: రోహిత్

పాక్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆ జట్టును తక్కువగా అంచనా వేయబోమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'పాక్ జట్టు అంచనాలను ఎప్పుడూ తలకిందుకు చేస్తుంది. లీగ్ దశలో పాక్‌పై విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఫైనల్‌కి చేరుకొనేందుకు అవకాశాలు మెరుగుపర్చుకుంటాం' అని పేర్కొన్నాడు.

రోహిత్ కెప్టెన్సీ సూపర్: గవాస్కర్

ఆసియా కప్‌లో తనదైన శైలిలో భారత జట్టును ముందుకు నడిపిస్తున్న రోహిత్ శర్మ కెప్టెన్సీ ఆకట్టుకొంటోందని మాజీ కెప్టెన్ గవాస్కర్ అన్నారు. సారథిగా అదనపు బాధ్యతలతో పాటు బ్యాటింగ్‌లోనూ రోహిత్ రాణిస్తుండటం శుభపరిణామన్నారు. కాగా సూపర్4లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్ ఫలితాన్ని ఊహించడం కష్టమని సన్నీ అభిప్రాయపడ్డారు.

Trending News