2వ రోజు రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. ఆసిస్ ఆలౌట్!

2వ రోజు రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. ఆసిస్ ఆలౌట్!

Last Updated : Dec 15, 2018, 11:16 AM IST
2వ రోజు రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. ఆసిస్ ఆలౌట్!

4 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒప్టస్‌ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు 108.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌట్ అయ్యారు. మొదటి రోజు బౌన్సీ పిచ్‌పై అంతగా రాణించలేకపోయిన భారత బౌలర్లు.. 2వ రోజు రెచ్చిపోయారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ టెయిలెండర్లు ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా వరుసగా పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆసిస్ భారీ స్కోర్ చేయకుండానే బ్యాటింగ్ ముగించింది. 277/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ జట్టుకు పైన్, కమిన్స్‌ జోడీ శుభారంభాన్నిచ్చింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు వికెట్ పడకుండా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఏడో వికెట్‌కు 59 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేయడంతో జట్టు స్కోరు 300 మార్క్ దాటింది. నిలకడగా ఆడుతూ ఆసిస్ స్కోర్ కార్డుని పరుగెత్తిస్తున్న ఈ జోడీని ఉమేష్ విడగొట్టడంతో ఇన్నింగ్స్ మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన టెయిలెండర్స్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో 326 పరుగులకే ఆసిస్ ఆలౌట్ అయింది. 

ఆసీస్ బ్యాట్స్‌మన్లలో హ్యారీస్ 70, హెడ్ 58, ఫించ్ 50, మార్ష్ 45, పైన్ 38 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ఇషాంత్ 4, బుమ్రా, ఉమేష్, విహారి తలో 2 వికెట్లు పడగొట్టారు. ఒకవేళ ఆసిస్ బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్ ధీటుగా ఎదుర్కుని భారీ స్కోర్ చేయగలిగితే, 2వ టెస్ట్ సైతం ఆసక్తికరంగా మారే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ ప్రియులు. అలా కాకుండా తొలి టెస్టు 2వ ఇన్నింగ్స్‌ తరహాలో ఆసిస్ బౌలర్లు కూడా చెలరేగిపోతే ఆట మరో విధంగా ఉండే అవకాశం లేకపోలేదు. అందులోనూ ఆసిస్ ఆటగాళ్లకు అది సొంత గడ్డ కావడం కూడా మరో కలిసొచ్చే అంశం అంటున్నారు విశ్లేషకులు.

Trending News