ఏబీ డివిలియర్స్‌కి తనదైన స్టైల్లో వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ

డివిలియర్స్ వీడ్కోలు ప్రకటనపై విరాట్ కోహ్లీ రియాక్షన్ 

Last Updated : May 27, 2018, 12:48 AM IST
ఏబీ డివిలియర్స్‌కి తనదైన స్టైల్లో వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ

దక్షిణ ఆఫ్రికా జట్టుకు చెందిన విధ్వంసకర ఆటగాడు ఎబీ డివిలియర్స్ గురించి విరాట్ కోహ్లీ గతంలో అనేక సందర్భాల్లో గొప్పగా చెప్పాడు. ఈ ఇద్దరూ కలిసి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడటం కూడా ఆ ఇద్దరినీ ఒకరికొకరు మరీ క్లోజ్ అయ్యేలా చేసింది. అయితే, ఇటీవల తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను అని డివిలియర్స్ ప్రకటించినప్పుడు యావత్ ప్రపంచం అతడి సేవలను ప్రశంసిస్తూ ఆకాశానికెత్తేసింది కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఏమీ స్పందించలేదు. దీంతో ఈ ఇద్దరి స్నేహం గురించి తెలిసిన క్రికెట్ ప్రియులు ఆశ్చర్యపోయారు. డివిలియర్స్ వీడ్కోలు ప్రకటనపై విరాట్ కోహ్లీ ఎందుకు స్పందించలేదు అనే విషయమై పలువురు సోషల్ మీడియాలో చర్చలు కూడా చేపట్టారు. అయితే, ఎట్టకేలకు డివిలియర్స్ వీడ్కోలు పలకడంపై కోహ్లీ తనదైన స్టైల్లో స్పందించాడు. లేటుగా చెప్పినా... లేటెస్టుగా చెబుతున్నాను అనే విధంగా డివిలియర్స్‌కి కోహ్లీ ఇచ్చిన ప్రశంసలు మరోసారి అతడిపై కోహ్లీకి వున్న అభిమానాన్ని బయటపెట్టాయి.

 

"ఇకపై నీ ప్రయాణంలో నీకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌లో నువ్వు ఆడిన రోజుల్లో బ్యాటింగ్ పంథానే మార్చేసిన ఆటగాడివి నువ్వు" అంటూ డివిలియర్స్‌ని అభినందించాడు కోహ్లీ. అన్నింటికిమించి డివిలియర్స్‌ని 'మై బ్రదర్' అని కోహ్లీ సంబోధించిన తీరు ఇంకా బాగుంది. కోహ్లీ చేసిన ఈ ట్వీట్‌కి నాలుగైదు గంటల వ్యవధిలోనే దాదాపు 61 వేల మంది లైక్స్ కొట్టారంటే అతడి ట్వీట్ వారిని ఎంత ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు కదా! 

Trending News