ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్: వృద్ధిమాన్ సాహ ఔట్.. దినేష్ కార్తిక్ ఇన్

వృద్ధిమాన్ సాహ స్థానంలో దినేష్ కార్తిక్ 

Updated: Jun 3, 2018, 12:23 AM IST
ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్: వృద్ధిమాన్ సాహ ఔట్.. దినేష్ కార్తిక్ ఇన్
AFP

కుడి చేతి బొటనవేలు గాయంతో బాధపడుతున్న వృద్ధిమాన్ సాహకు ఈ జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న టెస్ట్ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో దినేష్ కార్తిక్‌కి చోటు కల్పిస్తున్నట్టు బీసీసీఐ ఈ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 2018లో భాగంగా మే 25న జరిగిన ప్లే ఆఫ్స్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహ కుడిచేతి బొటనవేలికి గాయమైంది. ఈ గాయంతో బాధపడుతున్న సాహకు ఆరు వారాల విశ్రాంతి అవసరం అని ఫిట్‌నెస్ నిపుణులు తెలిపారు. దీంతో ఈ జూన్ 14 నుంచి బెంగుళూరు వేదికగా ప్రారంభం కానున్న ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ నుంచి సాహను తప్పించిన బీసీసీఐ అతడి స్థానంలో దినేష్ కార్తిక్‌కి అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఈ నిర్ణయంతో ఇంగ్లాండ్ టెస్ట్ సిరిస్ కన్నా ముందుగా సాహకు తగినంత విశ్రాంతి సైతం లభిస్తుంది అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 

2014 డిసెంబర్‌లో అప్పటి టీమిండియా కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటి నుంచి వృద్ధిమాన్ సాహ అతడి స్థానంలో వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. 32 టెస్టులు ఆడిన సాహా పరుగుల్లో 30కిపైగా సగటుతో రాణిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కి టీమిండియా రెగ్యులర్ కెప్టేన్ విరాట్ కోహ్లీ సైతం దూరంగా వుండనున్న సంగతి తెలిసిందే.