నిజమైన "సంక్రాంతి" తేది ఇదే.. పుకార్లను నమ్మవద్దు..!

ఈ సంవత్సరం సంక్రాంతి పండగను ఎప్పుడు జరుపుకోవాలన్న వివాదానికి తెరపడింది. 

Updated: Jan 12, 2018, 02:43 PM IST
నిజమైన "సంక్రాంతి" తేది ఇదే.. పుకార్లను నమ్మవద్దు..!

ఈ సంవత్సరం సంక్రాంతి పండగను ఎప్పుడు జరుపుకోవాలన్న వివాదానికి తెరపడింది. ముఖ్యంగా ఈ సంవత్సరం సంక్రాంతి 14వ తేదిన వస్తుందా లేక 15వ తేదిన వస్తుందా? అన్న విషయంలో నిన్న మొన్నటి వరకూ సందేహాలు తలెత్తాయి. అయితే తాజాగా ఈ విషయంపై వివరణ ఇస్తూ తెలంగాణ విద్వత్సభ జ్యోతిష్య విభాగ ప్రముఖులు స్పష్టతను ఇచ్చారు. 

14న రాత్రి 7.15కు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి.. ఆ తర్వాతి రోజునే సంక్రాంతి జరుపుకోవాలని వారు తెలిపారు. దీనితో తెలంగాణ రాష్ట్ర ప్రజల అనుమానాలన్నీ తీరాయి. కనుక 2018 సంవత్సరాన వచ్చే సంక్రాంతి పండుగలో భాగంగా భోగి పర్వదినాన్ని 14వ తేదిన జరుపుకోవాలని.. మకర సంక్రాంతిని 15 తేదిన, కనుమను 16వ తేదిన జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటనను కూడా జారీ చేస్తూ.. దానిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి వారు అందించారు. 

ఫేస్బుక్ పుకార్లను నమ్మద్దు..!
ప్రస్తుతం ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో సంక్రాంతి పండుగకు సంబంధించి, ఆ పండగ తేదీల గురించి అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయన్న మాట నిజమే. అయితే అలాంటి అశాస్త్రీయమైన వార్తలను నమ్మవద్దని ఇప్పటికే తెలంగాణ విద్వత్సభ తెలిపింది. పంచాంగం ప్రకారమే తాము ఈ తేదీలను ప్రకటించవలసి ఉంటుందని  విద్వత్సభ జ్యోతిష్య విభాగ ప్రముఖులు తెలిపారు. ప్రభుత్వం కూడా పంచాంగం ప్రకారమే సంక్రాంతి సెలవులను మంజూరు చేసిందని వారు పేర్కొన్నారు. 

తిథులు, నక్షత్రాలే ప్రామాణికం..!
పండగలకు తిథులు, నక్షత్రాలే ప్రామాణికమనే.. ఇతరత్రా ఏ సిద్ధాంతాలూ కావని ఈ సందర్భంగా చెప్పారు. మకర సంక్రమణ పుణ్యకాలం పదహారు గంటలని... దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటారని ఈ సందర్భంగా చెప్పారు. గతంలో కృష్ణాపుష్కరాలు, గోదావరి పుష్కరాల తేదిలు కూడా ఇలాగే వివాదాస్పదమయ్యాయి. కానీ వాటికి కూడా జ్యోతిష్య నిపుణులు వివరణ ఇచ్చారు.