'అధికారంలోకి వస్తే 26 కులాలను బీసీ జాబితాలో చేర్చుతాం'

'అధికారంలోకి వస్తే 26 కులాలను బీసీ జాబితాలో చేర్చుతాం'

Last Updated : Oct 20, 2018, 04:11 PM IST
'అధికారంలోకి వస్తే 26 కులాలను బీసీ జాబితాలో చేర్చుతాం'

తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె జనా రెడ్డి అన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల న్యాయమైన డిమాండ్లను కూడా చేర్చుతామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకొంటామన్నారు.

శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య జానారెడ్డిని హైదరాబాద్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా, 22 రాష్ట్ర స్థాయి డిమాండ్లతో పాటు ఏడు జాతీయ స్థాయి డిమాండ్లతో కూడిన నివేదికను కృష్ణయ్య జానారెడ్డికి సమర్పించారు. బీసీ సంఘాలు మహాకూటమికి మద్దతు అనే అంశంపై కూడా వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.

సమావేశం అనంతరం జానా రెడ్డి, ఆర్. కృష్ణయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. బీసీ సంక్షేమంపై అనేకమంది బీసీ సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని కలిసి వినతులను అందజేశారని గుర్తుచేశారు. వారం రోజుల్లో మహాకూటమి సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందన్నారు. బీసీల జాబితా నుండి తొలగించిన 26 కులాలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చేర్చుతామని హమీ ఇచ్చారు.

తమ మేనిఫెస్టోలోని అంశాలనే టీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు. తాము ప్రకటించిన అంశాలకు బడ్జెట్ సరిపోదని కేసీఆర్ విమర్శించారని.. ఇప్పుడు టీఆర్ఎస్ తమ మేనిఫెస్టోను అమలు చేసేందుకు నిధులను ఎక్కడి నుండి తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా శనివారం తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని జానారెడ్డి ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో మనుగడలో లేని కారణంగా.. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో కేసీఆర్ సర్కార్ బీసీ కులాల జాబితా నుంచి 26 కులాలను తొలగించింది. అప్పటి నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ జాబితాలో ఉన్న శెట్టి బలిజ, కళింగ, గవర, తూర్పుకాపు, కొప్పుల వెలమ, గాజుల బలిజ, నాగవంశీ, దేవాంగ, పొలినాటి వెలమ, కూరాకుల, పలిడోర, అరవ, బైరీ వైశ్య తదితర కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించింది. అటు బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను వెంటనే బీసీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చే రాజకీయ పార్టీలకే ఈ ఎన్నికల్లో తమ మద్దతు ఇస్తామని ఆయా కుల సంఘాల అధ్యక్షులు తేల్చి చెప్పారు.

Trending News