డిప్యూటీ సీఎంగా కోదండరామ్.. నిజం కాదన్న టీజేఎస్

డిప్యూటీ సీఎంగా కోదండరామ్.. నిజం కాదన్న టీజేఎస్

Last Updated : Oct 15, 2018, 06:40 PM IST
డిప్యూటీ సీఎంగా కోదండరామ్.. నిజం కాదన్న టీజేఎస్

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్.. మహాకూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం అవుతారని.. ఆమేరకు కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు ఈ పదవి ఆఫర్  చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ జన సమితి స్పందించింది.

ప్రొ.కోదండరామ్‌కు కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి పదవి ఇవ్వలేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ కూటమి లక్ష్యం అని టీజేఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మహా కూటమిలో తమకు సరైన స్థానమే ఉంటుందని భావిస్తున్నామంది.

ఆదివారం టీజేఎస్ పార్టీ .. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మధ్య భేటీ జరిగింది. అయితే ఈ భేటీలో పదవుల గురించి ప్రస్తావన రాలేదని స్పష్టత నిచ్చింది. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు నేతలు తమపై, తమ పార్టీ అధినేతపై చెడు ప్రచారం చేస్తున్నారని టీజేఎస్ తన ప్రకటనలో చెప్పుకొచ్చింది.  

మరోవైపు మహా కూటమి (కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ)లో ఇంకా సీట్ల సర్దుబాటులపై క్లారిటీ రాలేదు. అయితే పరిస్థితులకు అనుగుణంగానే సీట్ల సర్దుబాటు చేసుకోవాలని మహాకూటమి నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యతనిస్తూనే.. సమీకరణాలు, స్థానిక నాయకుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని టిక్కెట్టు ఖరారు చేయాలని యోచిస్తోంది. రెండు, మూడు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం వెలువడుతుందని అందరూ భావిస్తున్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే మహాకూటమి లక్ష్యమని నేతలు అన్నారు. మహాకూటమి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Trending News