చేప ప్రసాదం కోసం భారీగా తరలివచ్చిన ప్రజలు

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది.

Last Updated : Jun 8, 2018, 12:52 PM IST
చేప ప్రసాదం కోసం భారీగా తరలివచ్చిన ప్రజలు

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. చేప ప్రసాదం పంపిణీని శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రారంభించారు. ముందుగా వారిద్దరూ చేప ప్రసాదం తీసుకుని ప్రసాదం పంపిణీ ప్రారంభించారు.

బత్తిన కుటుంబం 173 ఏళ్లుగా చేప ప్రసాదాన్ని పంచుతోందని మంత్రి తలసాని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలనుంచి వేల సంఖ్యలో ప్రజలు వచ్చి చేప ప్రసాదాన్ని తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు చేప ప్రసాదంపై నమ్మకం పెరిగిందని, వర్షం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు పంపిణీ చేసే చేపమందు తీసుకొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చుట్టుప్రక్కల రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. బుధవారం రాత్రి నుంచే రాక మొదలవగా.. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా వసతులు కల్పించింది. లక్షమందికి పైగా వస్తారనే అంచనాతో తెల్లవారుఝామునుంచే ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టాండ్, సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

దీనికోసం 36 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీఐపీ, వికలాంగులు, వృద్ధుల కోసం స్పెషల్‌ కౌంటర్లు ఉన్నాయి. ఇప్పటికే లక్షా 30 వేల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేశారు. ప్రసాదం వేయడం కోసం 800 మంది వాలంటీర్లను నియమించారు.

Trending News