గజల్ శ్రీనివాస్‌ 'బ్రాండ్' పోస్ట్ హుష్‌కాకి!

గజల్ శ్రీనివాస్‌ 'బ్రాండ్ అంబాసిడర్' పోస్ట్ ఊడింది

Updated: Jan 3, 2018, 04:39 PM IST
గజల్ శ్రీనివాస్‌ 'బ్రాండ్' పోస్ట్ హుష్‌కాకి!

తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలు అందిస్తున్న గజల్ శ్రీనివాస్‌ని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్టుగా సేవ్ టెంపుల్ సంస్థ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాష్ రావు ప్రకటించారు. తమ సంస్థ మహిళల్ని గౌరవిస్తుందని, సంస్థలో పనిచేసే మహిళల్ని కూడా అంతే గౌరవప్రదంగా చూసుకుంటామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసిన ప్రకాష్ రావు.. మహిళలపై వేధింపుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కారణంగా గజల్ శ్రీనివాస్‌ని సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకాష్ రావు తేల్చిచెప్పారు. 

ఇదిలావుంటే, ఈ కేసులో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో వున్న గజల్ శ్రీనివాస్‌ని బెయిల్‌పై విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అతడి తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు.. గజల్ శ్రీనివాస్ బెయిల్‌పై బయటికొస్తే, బాధితురాలిని బెదిరించడంతోపాటు అతడికి వున్న పలుకుబడితో సాక్షాలని సైతం తారుమారు చేసే ప్రమాదం వుందని తమ కౌంటర్ పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇరువురి వాదనలు విన్న కోర్టు... తదుపరి విచారణని రేపటికి వాయిదా వేసింది.