తెలంగాణ ‘దోస్త్’ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలోని 2018-19 విద్యాసంవత్సరానికి గానూ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ‘దోస్త్’ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి విడుదల చేశారు.

Updated: May 9, 2018, 03:46 PM IST
తెలంగాణ ‘దోస్త్’ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్:  తెలంగాణలోని 2018-19 విద్యాసంవత్సరానికి గానూ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ‘దోస్త్’ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను, అందుకు చేపట్టిన సాంకేతిక ఏర్పాట్లను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో వివిధ గ్రూపులలో ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపడతామని, ఇందుకు అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాలేజీలకు వెళ్లి అడ్మిషన్ పొందే విధానానికి స్వస్తి చెప్పి 'దోస్త్' ద్వారా అడ్మిషన్ పొందాలని సూచించారు. సీట్ల భర్తీ ప్రక్రియను మూడు దఫాలుగా నిర్వహించనున్నారు. పాలిసెట్ అడ్మిషన్స్ కూడా ‘దోస్త్’ ద్వారానే చేపట్టుతామని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి. 

మొత్తం డిగ్రీ కాలేజీల్లో సీట్లు: 4 లక్షలకు పైగానే
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లు: 77 వేలు
ప్రైవేట్ డిగ్రీ కాలేజేల్లో సీట్లు: 3.21 లక్షలు

‘దోస్త్’ కౌన్సెలింగ్‌ ఇలా:

  • రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్:  మే 10 నుండి 26 వరకు (400 రూపాయల అదనపు రుసుంతో మే 29 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు)
  • తొలి దశ సీట్ల కేటాయింపు: జూన్ 4న
  • రెండో దశ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌:  జూన్ 5 నుంచి జూన్ 14 వరకు
  • రెండో దశ సీట్ల కేటాయింపు:  జూన్ 19న
  • విద్యార్థులు సంబంధిత కాలేజీలకు జూన్ 25లోగా వెళ్లి రిపోర్టు చేయాలి
  • అడ్వాన్స్ సప్లిమెంటరీ పాస్ స్టూడెంట్స్‌కు, రిజిస్టర్ కాని వాళ్లకు(మూడోదశ రిజిస్ట్రేషన్): జూన్ 20 నుండి జూన్ 27వరకు
  • మూడో దశ సీట్ల కేటాయింపు: జూన్ 30న
  • సీట్లు పొందిన వారు జూలై 4వ తేదీలోగా రిపోర్టు చేయాలి
  • మొదటి సెమిస్టర్ తరగతులు: జులై 2 నుంచి ప్రారంభం

* ఇంకా సీట్లు మిగిలి ఉంటే జూలై 5 నుండి 7 వరకు సంబంధిత కాలేజీల్లో స్లయిడింగ్ నిర్వహిస్తారు. సీట్ల కేటాయింపు జులై 10న జరుగుతుంది.  
* ఎన్‌సిసి, స్పోర్ట్సు, గేమ్స్ వంటి స్పెషల్ కేటగిరి అభ్యర్ధులకు ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది.
* సాధారణ అభ్యర్థులు హెల్ప్‌లైన్ సెంటర్లకు వెళ్లనక్కర్లేదు. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఒటిపి  ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించుకోవచ్చు.
* రాష్ట్రంలోని ఐదు యూనివర్శిటీల పరిధిలో 74 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్ధులు అక్కడికి వెళ్లకుండానే రిజిస్టర్డు మొబైల్ నెంబర్ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుకోవచ్చు.