జగిత్యాలలో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 50 మంది మృతి

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద పెను విషాదం చోటుచేసుకుంది.

Last Updated : Sep 12, 2018, 11:56 AM IST
జగిత్యాలలో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 50 మంది మృతి

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద పెను విషాదం చోటుచేసుకుంది. సుమారు 70 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్‌ రోడ్డు పైకి ఎక్కుతున్న సమయంలో మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 50 మంది మృతిచెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో  తీవ్రంగా గాయపడ్డ వారిని  మెరుగైన చికిత్స కోసం కరీంనగర్, హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసులు, స్థానికులు ఘటనాస్థలి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘాట్‌ రోడ్డు దిగుతుండగా బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో బస్సు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్ష్యులు కథనం.

కాగా ప్రముఖ స్థానిక మీడియా కథనం మేరకు.. మృతిచెందిన వారిలో ఇప్పటివరకు 35 మందిని గుర్తించగా వారిలో బస్సు డ్రైవర్‌ కూడా ఉన్నారు. కండక్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తరలించి.. అక్కడే బంధువులకు అప్పగించనున్నారు.

ఈ ప్రమాదంపై ఆపర్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం పట్ల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మెరుగైన సహాయక చర్యలను అందించాలని అధికారులను కోరారు.

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయిల చొప్పున పరిహారం ప్రకటించింది.

 

 

Trending News