బీసీ జాబితాలోకి మరో 30 కులాలు.. పరిశీలిస్తామన్న కేసీఆర్

బీసీ జాబితాలోకి 30 కులాలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

Last Updated : Jul 15, 2018, 05:18 PM IST
బీసీ జాబితాలోకి మరో 30 కులాలు.. పరిశీలిస్తామన్న కేసీఆర్

బీసీ జాబితాలోకి 30 కులాలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ రాసిన 'బీసీ కులాలు-సంచార జాతులు' పుస్తకాన్ని హైదరాబాద్ ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు గుర్తించని సంచార జాతులను వెనుకబడిన తరగతులుగా గుర్తించలేదని  గౌరీ శంకర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ 30 కులాలను బీసీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  దీంతో స్పందించిన కేసీఆర్‌.. సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చే విషయంపై అధ్యయనం చేసే బాధ్యతను రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించారు. సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న మరిన్ని కులాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ పరిశీలనలో ఉన్న 30 సంచార కులాలు:  సారోల్లు, అర్వకోమటి, తోలుబొమ్మలాటవారు, కుల్లకడిగి, బైల్‌ కమ్మర, అహిర్, గోవిలి, బాగోతుల, బొప్పాల, గంజికూటి వారు, శ్రీక్షత్రీయ రామజోగి, ఇనూటి, గుర్రపువారు, అడ్డాపువారు, సారగాని, కడారి తిడారోళ్లు, ఓడ్, పాథం వారు, సాధనాశూరులు, రుంజా, పనాస, పెక్కర, పాండవులవారు, గొడజెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, కాకిపడగల, మందహెచ్చుల, పప్పాల, సన్నాయిలు, బత్తిన కులాలకు చెందిన సంచార జాతులను బీసీ కులాల లిస్టులో చేర్చాల్సి ఉంది.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్లుగా బీసీలు, సంచార జాతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, పలు అధ్యయనాలను జూలూరు తన పుస్తకంలో వివరించారు. ఈ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎంపీ వినోద్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Trending News