పీజీ మెడిసిన్ స్టూడెంట్స్‌కి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

తెలంగాణ సీఎం కేసీఆర్ మెడిసిన్ విద్యలో పీజీ చదువుతున్న వారికి ఓ గుడ్ న్యూస్ వినిపించారు. 

Updated: Mar 8, 2018, 10:05 PM IST
పీజీ మెడిసిన్ స్టూడెంట్స్‌కి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

తెలంగాణ సీఎం కేసీఆర్ మెడిసిన్ విద్యలో పీజీ చదువుతున్న వారికి ఓ గుడ్ న్యూస్ వినిపించారు. పీజీ పూర్తి చేసిన విద్యార్థిని, విద్యార్థులు ఆ తర్వాత తప్పనిసరిగా ఓ ఏడాదిపాటు ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహించాలనే నిబంధనను ఎత్తివేయాలని భావిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.  ఇప్పటివరకు అమలులో వున్న నియమ నిబంధనల ప్రకారం పీజీ పూర్తయిన ప్రతీ మెడికల్ స్టూడెంట్ తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహించాల్సి వుంటుంది. అలా పూర్తిచేసుకున్న వారికే డాక్టర్‌గా రిజిష్టర్ అయ్యేందుకు అర్హత సాధించడం అనేది ఈ నిబంధన వెనుకున్న లక్ష్యం. 

అయితే, ఈ నిబంధన వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని, ఈ షరతు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటికప్పుడు మెడికోల నుంచి వినిపిస్తూనే వున్న నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ వారికి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రులలో సిబ్బంది సరిగ్గా వుండేవారు కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున ఇంకా పీజీ విద్యార్థుల సేవల్ని వినియోగించుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త బిల్లుని పాస్ చేయించే యోచనలో కేసీఆర్ వున్నారని సమాచారం.