మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

వేసవిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి ఒంటిపూట బడులను నడపాలని నిర్ణయించింది.

Updated: Mar 13, 2018, 01:01 PM IST
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

వేసవిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి ఒంటిపూట బడులను నడపాలని నిర్ణయించింది. మార్చి 15 నుండి తెలంగాణలోని అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం  12.30 వరకు తరగతులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ కిషన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  2017-18 విద్యా సంవత్సరం చివరి రోజు వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపింది.

"మార్చి 15 నుంచి 2017-18 విద్యా సంవత్సరం చివరి పనిదినం వరకు వేసవి దృష్ట్యా ఒంటిపూట బడులను నిర్వహించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులను నిర్వహించాలి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రవేట్ యాజమాన్యాల కింద నడిచే అన్ని పాఠశాలలకు ఇది వర్తిస్తుంది" అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో ఎండలు ఎక్కువగా ఉండటం చేత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలోని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లకు, జిల్లా విద్యా శాఖ అధికారులకు  ఉత్తర్వులను జారీచేసి అవసరమైన చర్య తీసుకోవాలని ఆదేశించారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా కొనసాగుతున్న పాఠశాలలను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని ఆదేశించారు. ఇక ఉన్నత పాఠశాలల్లో ఐచ్ఛిక సెలవుల విధానాన్ని మార్చుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించారు. ఐచ్ఛిక సెలవులను ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కాకుండా పాఠశాల పరంగా తీసుకోవాలని పేర్కొన్నారు.