57 ఏళ్లు నిండిన వారికి ఇవ్వనున్న వృద్ధాప్య పెన్షన్ నియమనిబంధనలు ఇవే..

ఆసరా పథకానికి అర్హతలు, నియమనిబంధనలు..

Last Updated : Dec 19, 2018, 08:23 PM IST
57 ఏళ్లు నిండిన వారికి ఇవ్వనున్న వృద్ధాప్య పెన్షన్ నియమనిబంధనలు ఇవే..

హైదరాబాద్: తెలంగాణలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా ప్రభుత్వం తరపున చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం అమలులో వున్న నిబంధనల ప్రకారం 65 ఏళ్లు నిండిన వారికే ఈ ఆసరా పెన్షన్లు వర్తిస్తుండగా... వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 57 ఏళ్లు నిండిన వారికి కూడా వృద్ధాప్య పెన్షన్లు అందచేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ చేసిన సూచనలు మేరకు తాజాగా అధికారయంత్రాగం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించింది. ఈమేరకు ప్రభుత్వం జారీచేసిన నియమనిబంధనలు, మార్గదర్శకాలు ఇలా వున్నాయి. ఈసారి వయసు నిర్ధారణకు ఓటరుకార్డును ప్రామాణికంగా తీసుకోవడం విశేషం. మిగిలిన ఆసరా పింఛన్ల నిబంధనలు యథాతథంగా ఉంటాయి.    

నిబంధనలు..
> 57 ఏళ్లు నిండినవారు అర్హులు (1953–1961 మధ్య జన్మించిన వారై ఉండాలి).
> ఓటర్‌ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారణ.
> దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు అనర్హులు (తెల్ల రేషన్ కార్డు కలిగి వుండటం దారిద్ర్యరేఖకు దిగువన వుండటాన్ని సూచిస్తుంది).
> విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్న వారు ఈ ఆసరా పెన్షన్ పథకానికి అనర్హులు.
> దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండొద్దు. 
> దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు పరిమితి దాటొద్దు.
> దరఖాస్తుదారులకు పెద్ద పెద్ద వ్యాపారాలు ( ఆయిల్, రైస్, పెట్రోల్‌ పంపులు వంటి ఇతర వ్యాపారాలు) ఉండరాదు.
> పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేవారు.. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి వున్న వారు అయ్యుండకూడదు.
> దరఖాస్తుదారులకు భారీ వాహనాలు (హెవీ వెహికిల్స్) ఉండరాదు. 
> ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు అనర్హులు.
> లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులై ఉండరాదు.

Also read : మీ ఓటు హక్కు గల్లంతయ్యిందా ? ఓటర్ ఐడీ వివరాల్లో తప్పులున్నాయా ? అయితే ఇది మీకోసమే..

లబ్ధిదారులను ఎంపిక చేసే విధానం..
> ఓటర్ కార్డులో 2018 నవంబర్‌ 19 నాటికి 57 ఏళ్లు నిండినవారు అర్హులు కాగా గ్రామాల్లో అయితే వీఆర్వోలు, పట్టణాల్లో అయితే, బిల్‌ కలెక్టర్లు దరఖాస్తుదారుల దరఖాస్తులను పరిశీలించి తమ పై అధికారులకు దరఖాస్తులను చేరవేస్తారు.
> లబ్ధిదారుల ఎంపిక అనంతరం ఆ ముసాయిదా జాబితాను గ్రామ/వార్డు సభల ద్వారా ప్రదర్శించి, ఆ జాబితాపై స్థానికుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు.
> అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం తుదిజాబితాను రూపొందిస్తారు.
> లబ్ధిదారుల ఆధార్‌ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు/ బిల్‌ కలెక్టర్లు సేకరిస్తారు.
> గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు లబ్ధిదారుల తుది జాబితాను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు పంపుతారు.
> లబ్ధిదారుల తుది జాబితాను ఎంపీడీవో/ మున్సిపల్‌ కమిషనర్లు ప్రస్తుతం వున్న ఆసరా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

Trending News