దళితులకు, గిరిజనులకు ఉచితంగా రేషన్: ఉత్తమ్

దళితులకు, గిరిజనులకు ఉచితంగా రేషన్: ఉత్తమ్

Last Updated : Oct 17, 2018, 05:39 PM IST
దళితులకు, గిరిజనులకు ఉచితంగా రేషన్: ఉత్తమ్

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ..తమ పార్టీ మ్యానిఫెస్టోను కాపీ కొట్టిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలను ప్రజలు ఇస్తుందో.. వాటిని మక్కీకి మక్కీ దించేశారని ఎద్దేవా చేశారు. మావి తప్పుడు హామీలన్న కేసీఆర్ ఇప్పుడు ఏం చెబుతారన్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వారిని చల్లార్చేందుకే ఈ మ్యానిఫెస్టోను రూపొందించారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ సరిపోదన్న కేసీఆర్.. ఇప్పుడెలా వీటిని అమలు చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను గమనిస్తే.. టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నౌకని కెసిఆర్ చెప్పకనే చెప్పారన్నారు. దళితుడిని సీఎం చేయడం సహా వారికిచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదని ఉత్తమ్ మండిపడ్డారు. 40 లక్షల మంది గిరిజనుల్లో ఒక్కరికీ మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు.  ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ విషయంలో కూడా మోసం చేశారని మండిపడ్డారు.  గత నాలుగేళ్ల కాలంలో నాలుగు వేల మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో ఒక్క కుటుంబానైనా కేసీఆర్ పరామర్శించిన పాపాన పోలేదన్నారు.

అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి ఆరు వంట గ్యాస్ సిలిండర్లను ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు దారులకు ఒక్కొక్కరికి కిలో రూపాయి చొప్పున 6 కేజీల సన్న బియ్యం ఇస్తామన్నారు. దారిద్ర్య రేఖ (బీపీఎల్) కు దిగువన ఉన్న దళితులు, గిరిజనులకు ఉచితంగా ఆరు కేజీల సన్న బియ్యంతో పాటు పిండి, పామోలిన్ ఆయిల్, కందిపప్పు, చక్కెర, ఉప్పు, చింతపండు, పసుపు ఇస్తామన్నారు. 

 

Trending News