టీ-టూరిజం ప్రచారానికి నలుగురు మహిళల సాహసయాత్ర

తెలంగాణ రాష్ట్ర పర్యాటక విశేషాలను దేశ విదేశాల్లో చాటిచెప్పేందుకు నలుగురు యువతులు ఆదివారం ఉదయం 7 గంటలకు పర్యాటక భవనం నుంచి యాత్ర ప్రారంభించారు.

Updated: Feb 11, 2018, 03:58 PM IST
టీ-టూరిజం ప్రచారానికి నలుగురు మహిళల సాహసయాత్ర

తెలంగాణ రాష్ట్ర పర్యాటక విశేషాలను దేశ విదేశాల్లో చాటిచెప్పేందుకు నలుగురు యువతులు ఆదివారం ఉదయం 7 గంటలకు పర్యాటక భవనం నుంచి యాత్ర ప్రారంభించారు. ఈ బృందానికి జై భారతి అనే మహిళ తన స్నేహితులు ప్రియా, శాంతి, శిల్పలతో కలిసి నాయకత్వం వహిస్తున్నారు. వీరు బైక్‌లపై దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం దేశాల్లో యాత్ర కొనసాగించి తెలంగాణ పర్యాటక విశేషాలను, ప్రత్యేకతలను చాటిచెప్తారని పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు.

యాత్రలో భాగంగా  ఏడు దేశాల్లోని 19 వారసత్వ కట్టడాలతో సహా, మరో 35 యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాల వద్ద మహిళా బైక్ రైడర్లు వీడియో ప్రదర్శన ద్వారా తెలంగాణ పర్యాటక విశేషాలను ప్రచారం చేయనున్నారు.ఈ నలుగురు మహిళా బైక్ రైడర్లు 50 రోజులపాటు 17 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారని, తూర్పు ఆసియా దేశాల్లో పర్యటించేందుకు అనువైన 400 సీసీ బైకులను బజాజ్ అటో కంపెనీ స్పాన్సర్ చేసిందని తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు.

వీరు పర్యటించే రాష్ట్రాలు, దేశాల అధికారులతో సంప్రదింపులు జరిపి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చర్యలు తీసుకుందన్నారు. తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. యాత్రకు నాయకత్వం వహిస్తున్న జైభారతి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం 'షీ' బృందాలను ఏర్పాటు చేసి మహిళలకు భరోసా కల్పించిందని, అమ్మాయిలు రాష్ట్రంలో క్షేమంగా తిరుగుతున్నారని, ఈ స్ఫూర్తితోనే బైక్‌లపై సాహసయాత్రను చేస్తున్నామని చెప్పారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close