డేంజరస్ డ్రైవ్: 18 మంది మృతి, 60 మందికి గాయాలు

18 మంది ప్రాణాలు తీసిన అతి వేగం 

Updated: Feb 11, 2018, 02:47 AM IST
డేంజరస్ డ్రైవ్: 18 మంది మృతి, 60 మందికి గాయాలు

హాంగ్‌కాంగ్‌లో చోటుచేసుకున్న ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 18 మంది మృతి చెందగా మరో 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. తై పో నగరానికి సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం దృశ్యాలు అతి భయంకరంగా కనిపించాయి. డబుల్ డెక్కర్ బస్సు పై భాగం కొంతమేరకు చీలిపోవడంతోపాటు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైన తీరు చూస్తేనే ప్రమాదం తీవ్రత ఎలా వుందో అర్థమవుతోంది. బస్సుని నిర్లక్ష్యంగా, అత్యంత వేగంగా నడిపినందు వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రహించిన పోలీసులు వెంటనే డ్రైవర్‌ని అరెస్ట్ చేసి తమ అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో 14 మంది పురుషులు కాగా మరో నలుగురు మహిళలు వున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో మరో 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా వుందని సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి.

ఈ డబుల్ డెక్కర్ బస్సులో పై భాగంలో ప్రయాణిస్తున్న వారే అత్యంత ప్రమాదానికి గురయ్యారని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ సీనియర్ సూపరింటెండెంట్ లీ చీ-వై మీడియాకు చెప్పారు. 

"డ్రైవర్ వేగం చూసి అతడిని ముందే హెచ్చరించాం. దుర్ఘటన జరగడానికి కొద్ది ముందు కూడా అతడిని వారించాం. అయినా అతడు తమ మాట పట్టించుకోకుండా మరింత వేగం పెంచాడు" అని బస్సు ప్రయాణంలో గాయపడిన బాధిత ప్రయాణికుడు మీడియా ఆవేదన వ్యక్తంచేశాడు. బస్సు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తోందనే కారణంతోనే డ్రైవర్ వేగాన్ని పెంచినట్టు సదరు బాధితుడు పేర్కొన్నాడు.