అది పుస్తకం కాదు.. ఓ ఆశల పయనం..!

అబింతా కబీర్... ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.? జులై 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ హోటల్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని ఈమె.

Updated: Feb 5, 2018, 02:09 PM IST
అది పుస్తకం కాదు.. ఓ ఆశల పయనం..!
Image Credit: Abinta Kabir Foundation

అబింతా కబీర్... ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.? జులై 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ హోటల్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని ఈమె. ఈ దాడిలో అబింతా పాటు ఆమె స్నేహితులు తరుషి జైన్,  ఫరాజ్ హుస్సేన్‌‌లు కూడా దారుణంగా కాల్పులకు గురై మరణించారు. ఎంతో విషాదభరితమైన ఈ ఘటనలో తొలుత ఫరాజ్ హుస్సేన్‌ను వదిలివేయాలని ముష్కరులు భావించినా.. తన స్నేహితులను వదిలి వెళ్ళనని చెప్పడంతో తనను కూడా కాల్చివేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సంఘటన సంచలనం సృష్టించింది.

జాత్యాహంకారంతో ముష్కరులు చెలరేగిపోతూ.. విదేశీయులను, పాశ్చాత్య దుస్తులు ధరించిన వారిని చంపుతామని నినాదాలు చేస్తూ వచ్చి.. తరుషి, అబింతాలను కూడా ఏ ప్రాంతం వారని ప్రశ్నించారు. వారు భారత్, అమెరికా అని చెప్పడంతో వారిపై గన్స్ ఎక్కుపెట్టారు. బెంగాలీ మాట్లాడిన ఫరాజ్‌ను వదిలేస్తూ.. దూరంగా పారిపోమని చెప్పారు. అయితే తన స్నేహితురాళ్ళను  విడిచి తాను రానని అనడంతో అతనితో పాటు తన స్నేహితులపై కూడా తూటాల వర్షం కురిపించారు.  అంతటితో ఆ దుండగులు శాంతించలేదు. మృతదేహాల  ఛాయాచిత్రాలను ఇంటర్నెట్లో కూడా  పోస్టు చేశారు.

ఈ సంఘటన జరిగిన ఇన్నేళ్ళ తర్వాత అబింతా కబీర్ తల్లి రుబా అహ్మద్ ఓ నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె జీవితానుభవాలతో ఓ ఆత్మకథను విడుదల చేశారు. ఆ పుస్తకానికి "డ్రీమ్స్ ఇన్స్‌పైర్ ఛేంజ్" అనే పేరు పెట్టారు. ఇటీవలే ఆ పుస్తకాన్ని కోల్‌‌కతాలో బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమీషనర్ తౌఫీక్ హసన్ చేతుల మీదుగా విడుదల చేశారు.

రుబా అహ్మద్ మాట్లాడుతూ "నేను ఎప్పటికీ మర్చిపోలేని ఆ దారుణమైన ఘటనలో స్నేహితులు ఒకరికోసం ఒకరు ప్రాణాలు పణంగా పెట్టడం నన్ను కలచివేసింది. వారు నిజమైన మిత్రులు. అబింతాకి ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉండేవి. బంగ్లాదేశ్‌లో పేదపిల్లల కోసం ఓ ఎన్జీఓ స్థాపించాలన్నది ఆమె కోరిక. అందుకు సంబంధించిన కోర్సులు చేయడం కోసం ఆమె అమెరికా వెళ్లింది. కానీ తన ఆశలు తీరకుండానే వివక్షకు గురై మరణించింది" అని తెలిపారు. ప్రస్తుతం ఆమె తన కుమార్తె పేరు మీద అబింతా కబీర్ ఫౌండేషన్ అనే ఓ సంస్థను నడుపుతున్నారు

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close