3 ఏళ్ల బాబు ఏడిచాడని విమానంలోంచి దించేశారు

బ్రిటీష్ ఎయిర్‌వేస్ జాత్యాహంకార చర్య

Last Updated : Aug 9, 2018, 05:36 PM IST
3 ఏళ్ల బాబు ఏడిచాడని విమానంలోంచి దించేశారు

విమానం బయల్దేరడానికి ముందు ఓ మూడేళ్ల బాబు ఏడిచాడనే ఆగ్రహంతో, ఓ భారతీయ కుటుంబాన్నే విమానంలోంచి దించేసిన ఘటన లండన్‌లో చోటుచేసుకుంది. జూలై 23న లండన్ నుంచి బెర్లిన్‌కు బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కి చెందిన BA 8495 విమానంలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైందంటూ స్వయంగా ఆ బాలుడి తండ్రి భారత విమానాయాన శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ఓ లేఖ రాశారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో వారి దురహంకారం కారణంగా తన కుటుంబానికి జరిగిన అవమానం గురించి వివరిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు ఆ భారతీయుడు. 

లండన్ నుంచి బెర్లిన్ బయల్దేరేందుకు సిద్ధమైన బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో మూడేళ్ల బాబు ఉన్నట్టుండి ఏడుపు అందుకున్నాడు. బాలుడిని అతడి తల్లి ఎలాగోలా సముదాయించి కూర్చోబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే అక్కడకు చేరుకున్న బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం సిబ్బంది.. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా ఆ బాలుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని, దీంతో తన కొడుకు మరింత ఏడుపు లంకించుకున్నాడని బాలుడి తండ్రి సురేష్ ప్రభుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

బాలుడు ఎంతకూ ఏడుపు ఆపకపోవడంపై మరింత ఆగ్రహం వ్యక్తంచేసిన విమానం సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి టెర్మినల్‌లోకి తీసుకెళ్లి తమ కుటుంబం మొత్తా్న్ని బలవంతంగా దించేశారని తనకు జరిగిన అన్యాయంపై సురేష్ ప్రభుకు ఫిర్యాదు చేశారు బాధితుడు. బాలుడికి బిస్కెట్స్ ఇచ్చి ఏడుపు ఆపేందుకు ప్రయత్నించిన మరో భారతీయ కుటుంబాన్ని సైతం విమానం సిబ్బంది బోర్డింగ్ పాస్‌లు లాక్కుని దింపేశారని బాలుడి తండ్రి తెలిపారు. 

ఈ ఘటనపై స్పందించిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి.. "జాతి విద్వేషాన్ని ప్రోత్సహించడం తమ అభిమతం కాదని, ఎటువంటి విద్వేషాలనైనా బ్రిటీష్ ఎయిర్‌వేస్ సహించబోదు" అని తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు బ్రిటీష్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి చెప్పారు. 

Trending News