కఠిన నిబంధన: స్కూళ్లలో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై నిషేధం

ఇక మీదట స్కూళ్లలో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు వాడరాదు.

Updated: Aug 2, 2018, 02:28 PM IST
కఠిన నిబంధన: స్కూళ్లలో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై నిషేధం

ఇక మీదట స్కూళ్లలో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు వాడరాదు. స్కూళ్లలో విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లును వాడరాదంటూ పూర్తిగా నిషేధిస్తూ ప్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇటీవలే ప్రాన్స్ ప్రభుత్వం విద్యార్థులు స్కూల్ సమయాల్లో స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు ఉపయోగించరాదని కొత్త చట్టం చేసింది. దీనిపై ఫ్రెంచ్ పార్లమెంట్‌లో ఓటింగ్ కూడా జరిగింది.

ఈ కొత్త చట్టం ప్రకారం, 15 ఏళ్ల వరకు వయస్సున్న విద్యార్థులు స్కూల్‌లో స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు వాడరాదు. ఒకవేళ విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లను తీసుకొచ్చినా.. స్కూల్ జరిగే సమయాల్లో తప్పనిసరిగా స్విచాఫ్ చేసి పెట్టుకోవాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా ఫోన్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలట.

ఫ్రాన్స్‌లో 1 నుంచి 19 ఏళ్లలోపు వయస్సున్న 78 శాతం మంది విద్యార్థులు, యువత స్మార్ట్ ఫోన్‌కు బానిసైపోయారని 'జూనియర్ కనెక్ట్ 2015' రిపోర్టులో పిల్లల నిపుణులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఫ్రెంచ్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ కూడా పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసైపోయారని పేర్కొన్నారు. అయితే 2010లోనే స్కూళ్లలో స్మార్ట్ ఫోన్‌లను పాక్షికంగా నిషేధం విధించగా.. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిషేధం విధించారు.  

ఈ మధ్యే డ్రైవింగ్ చేస్తూ స్మార్ట్‌ ఫోన్‌ను వాడరాదంటూ ఫ్రాన్స్ ఆదేశాలు జారీ చేసింది. వాహనం ఆగి ఉన్నా.. ఇంజిన్ ఆఫ్ చేసి ఉన్నా.. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి స్మార్ట్‌ఫోన్ మాట్లాడరాదు అని ఆదేశించింది.