బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానికి జైలుశిక్ష..!

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని బేగం ఖలేదా జియాకు అక్కడి ప్రత్యేక కోర్టు 5 సంవత్సరాల పాటు జైలుశిక్ష విధించింది.

Updated: Feb 8, 2018, 06:30 PM IST
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానికి జైలుశిక్ష..!

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని బేగం ఖలేదా జియాకు అక్కడి ప్రత్యేక కోర్టు 5 సంవత్సరాల పాటు జైలుశిక్ష విధించింది. చిన్నపిల్లల ట్రస్టుకు విదేశాల నుండి విరాళాలను స్వీకరించిన క్రమంలో వాటిని అక్రమ మార్గంలో జియా ఉపయోగించుకున్నారని కోర్టు తెలిపింది. అందుకు తగ్గ సాక్ష్యాధారాలు లభించడంతో ఆమెకు శిక్షను ఖరారు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

నేషలిస్టు పార్టీ నేతైన ఖలేదా జియా రెండు సార్లు ప్రధానిగా పనిచేశారు. స్వచ్ఛంద సేవా సంస్థకు చెందాల్సిన 21 మిలియన్ టాకాలను (భారతీయ కరెన్సీలో దాదాపు 1 కోటి అరవై లక్షల రూపాయలు) జియా దుర్వినియోగం చేసినందుకు ఈ శిక్షను విధించామని న్యాయమూర్తి తెలియజేశారు. ఈ కేసులో జియాకి సహకరించిన ఆమె కుమారుడితో పాటు మరో నలుగురికి కూడా 10 సంవత్సరాలు జైలుశిక్ష విధించింది కోర్టు. 

బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిమంత్రిగా వార్తల్లోకెక్కిన ఖలేదా జియా 1991లో ఆ బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రెసిడెంట్ జియౌర్ రెహ్మాన్ సతీమణి అయిన ఖలేదా మరో బంగ్లాదేశ్ మహిళా ప్రధాని షేక్ హసీనాకు ప్రత్యర్థి. 72 ఏళ్ళ జియా జైలుకి వెళ్తున్నారన్న వార్త తెలియగానే అనేకమంది ఆమె బంధువులు, అభిమానులు కోర్టుకి తరలివచ్చారు. ఆమెకు బెయిల్ ఇప్పించడం కోసం ప్రస్తుతం ఆమె లాయర్లు ప్రయత్నిస్తున్నారు.

అయితే శిక్ష పడింది కాబట్టి... రాబోయే సాధారణ ఎన్నికలలో జియా పోటీ చేయడానికి అర్హత ఉన్నట్టా.. లేనట్టా అనే విషయంలో ఇంకా ఆమె అభిమానులను పలు సందేహాలు వెంటాడుతున్నాయి. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం ఎవరికైనా రెండు సంవత్సరాల శిక్ష పడితే.. వారు 5 సంవత్సరాల వరకు ఎలాంటి ఎన్నికలలోనైనా పోటీ చేయడానికి అనర్హులు. ఈ క్రమంలో ఈ శిక్ష ఖలేదా జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయంపై పలు సందేహాలు బంగ్లాదేశ్ రాజకీయవేత్తలను వెంటాడుతున్నాయి.