అమెరికాలో దక్షిణ భారతీయ దంపతుల అరెస్ట్!!

అమెరికాలో భారతీయ దంపతుల అరెస్ట్, బెయిల్‌పై విడుదల!

Updated: Sep 14, 2018, 07:21 PM IST
అమెరికాలో దక్షిణ భారతీయ దంపతుల అరెస్ట్!!

అమెరికాలోని ఫ్లోరిడాలో అరెస్ట్ అయిన భారతీయ దంపతులకు గురువారం బెయిల్ లభించింది. తమిళనాడుకు చెందిన ప్రకాష్ శెట్టు, మాలా పన్నీర్‌సెల్వం దంపతులు తమ ఆరు నెలల చిన్నారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, చిన్నారిపై హింస వంటి నేరాలతోపాటు చిన్నారికి వైద్య పరీక్షలు చేయనివ్వలేదనే అభియోగాల కింద అక్కడి పోలీసులు ఈ దంపతులను అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో అనారోగ్యానికిగురైన చిన్నారికి పలు వైద్య పరీక్షలు అవసరం కాగా ఆ వైద్య పరీక్షలు చేయించేంత ఆర్థిక స్తోమత తమకు లేదంటూ ఆస్పత్రి సిబ్బంది సూచనలను ధిక్కరిస్తూ ఈ దంపతులు తమ చిన్నారిని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, చిన్నారి విషయంలో తల్లిదండ్రుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన అక్కడి అధికారయంత్రాంగం, పోలీసులు.. చిన్నారిని బాలల సంరక్షణా కేంద్రానికి అప్పగిస్తూ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. బెయిల్ మంజూరు చేయాలంటే 2 లక్షల డాలర్లు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చిన అక్కడి కోర్టు అనంతరం వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 30,000 డాలర్లకు బెయిల్ మంజూరు చేసింది.

ఇదే విషయమై ప్రకాశ్, మాలా పన్నీర్‌సెల్వం దంపతులకు సన్నిహతులు స్పందిస్తూ.. చిన్నారి వైద్యపరీక్షల కోసం ఆ దంపతులు చాలా చోట్ల ఆరాతీశారని, ఇందులో వారి తప్పేమీ లేదని చెప్పినట్టుగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తమ కథనంలో పేర్కొంది. అంతేకాకుండా ఆ దంపతులు న్యాయపోరాటం సాగించేందుకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చేందుకు అక్కడి భారతీయులు నిధుల సేకరణ (ఫండ్ రైజింగ్) సైతం చేపట్టినట్టు ఆ కథనం స్పష్టంచేసింది. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close