పాక్ జైల్లో నవాజ్ షరీఫ్.. లండన్‌లో కన్నుమూసిన ఆయన భార్య కుల్సుమ్

లండన్‌లో నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్ కన్నుమూత 

Last Updated : Sep 11, 2018, 09:33 PM IST
పాక్ జైల్లో నవాజ్ షరీఫ్.. లండన్‌లో కన్నుమూసిన ఆయన భార్య కుల్సుమ్

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా గొంతు క్యాన్సర్‌ బాధపడుతున్న నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్(68) లండన్‌లో తుదిశ్వాస విడిచారు. గొంతు క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స నిమిత్తం లండన్‌ వెళ్లిన కుల్సుమ్ నవాజ్.. అక్కడి హ్యార్లీ స్ట్రీట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జూన్ మొదటి వారంలో ఆమె ఆస్పత్రిలో చేరగా జూన్ 15న ఆమెకు గుండెపోటు వచ్చింది. గుండెపోటు అనంతరం అప్పటి నుంచి ఆమె వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఆమెకు కృత్రిమ శ్వాసను అందించారు. ఇదిలాఉండగానే ఆమెకు ఊపరితిత్తుల సమస్య కూడా తిరగదోడటంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచినట్టుగా జియో న్యూస్ పేర్కొంది. 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం నవాజ్ షరీఫ్, ఆయన కుమర్తె మర్యమ్ పాక్ జైళ్లలో ఖైదీలుగా ఉన్నారు. నవాజ్-కుల్సుమ్‌లకు మర్యం, హస్సన్, హుస్సేన్, ఆస్మ నలుగురు సంతానం.

Trending News