సౌదీ ఉత్సవాలకు విశిష్ట అతిథిగా భారత్..!

సౌదీ అరేబియాలో ప్రతీ సంవత్సరం జరిగే సంప్రదాయ జనద్రియ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ సంవత్సరం ఆ దేశం విశిష్ట అతిథిగా, గౌరవ అతిథిగా భారత్‌ను ఆహ్వానించింది.

Updated: Feb 5, 2018, 03:41 PM IST
సౌదీ ఉత్సవాలకు విశిష్ట అతిథిగా భారత్..!

సౌదీ అరేబియాలో ప్రతీ సంవత్సరం జరిగే సంప్రదాయ జనద్రియ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ సంవత్సరం ఆ దేశం విశిష్ట అతిథిగా, గౌరవ అతిథిగా భారత్‌ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ తరఫున మంగళవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెళ్ళనున్నారు.  ఫిబ్రవరి 6, 8 తేదీల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి.

ఇటీవలే ఈ విషయమై సౌదీలో జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత విదేశాంగ సహాయమంత్రి వికే సింగ్, సౌదీ మంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఇలాంటి ఉత్సవాలు ఇరు దేశాల మధ్య బంధాలను మరింత పెంచుతాయనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాల్లో భారతదేశ సంప్రదాయాలను ప్రతిబింబించే పలు కళారూపాలను కూడా ప్రభుత్వం తరఫున కళాకారులు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. 

ఈ ఉత్సవాల్లో ఇస్రో, ఆయుష్, ఇండియన్ టూరిజం బోర్డు, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా మొదలైన ప్రభుత్వ బ్రాండ్లకు చెందిన స్టాల్స్‌ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా సౌదీ పౌరులకు భారతీయ వంటకాలను పరిచయం చేయడానికి "ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా" పేరుతో ఒక ప్రత్యేక థీమ్‌తో ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. చైనా, అమెరికా, యూఏఈ తర్వాత సౌదీ అరేబియాకి భారత్ మాత్రమే అతి పెద్ద వాణిజ్య పార్టనర్‌గా కొనసాగుతోంది.