సిరియా అంతర్యుద్ధం: రసాయన దాడిలో వందలమంది చిన్నారులు మృతి

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో కెమికల్ దాడి జరిగింది.

Updated: Apr 9, 2018, 04:23 PM IST
సిరియా అంతర్యుద్ధం: రసాయన దాడిలో వందలమంది చిన్నారులు మృతి

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో కెమికల్ దాడి జరిగింది. సిరియా తూర్పు భాగంలోని గౌటాపై జరిగిన తిరుగుబాటుదాడుల్లో వంద మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉండగా మరికొంతమంది చిన్నారులు గల్లంతు అవ్వడం గమనార్హం. ఈ క్రమంలో వందలాది పౌరులు శ్వాస, కంటిచూపు సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిరియాలోని ఆసుపత్రులన్నీ చిన్నారులతో నిండి ఉండటంతో చికిత్స అందించడం కూడా కష్టంగా మారిందని రిపోర్టులు తెలుపుతున్నాయి. కాగా ప్రభుత్వదళాలే ఇలా కెమికల్ దాడులు చేయడం పట్ల పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. తిరుగుబాటుదారులే అంతర్జాతీయంగా మద్దతు పొందటం కోసం ఇలా నకిలీ వీడియోలను సృష్టించారని.. రసాయనిక దాడి జరగలేదని సిరియా అధికారిక మీడియా వెల్లడించింది.  

ప్రస్తుతం తూర్పు గౌటా ప్రాంతంలో తిరుగుబాటుదారుల చేతిలో ఉన్న ఏకైక పట్టణం డౌమా ఒక్కటే. శనివారం మధ్యాహ్నం వైమానిక దాడి తర్వాత తమకు కళ్లు మండుతున్నాయనీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందంటూ కొంతమంది ఆసుపత్రికి  వచ్చారు. ఆ తర్వాత శనివారం రాత్రి ఓ ప్రభుత్వ హెలికాప్టర్‌ వచ్చి గుర్తు తెలియని రసాయనాన్ని వెదజల్లిందనీ, తీవ్రత ఇంకా పెరగడంతో అనేకమంది ప్రజలు విషవాయువు బారిన పడ్డారని సహాయక సిబ్బంది వివరించారు. విషపూరిత క్లోరిన్‌ వాయువుతో ప్రభుత్వ దళాలు దాడిచేసినట్లు ‘వైట్‌ హెల్మెట్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది.

అమెరికా సీరియస్

డౌమా పట్టణంపై రసాయనిక దాడి జరిగిన నేపథ్యంలో సిరియా, రష్యా ప్రభుత్వాలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసద్‌ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు ఈ దాడికి రష్యానే బాధ్యత వహించాలని ఘాటుగా పేర్కొంది. ‘డౌమాను సిరియా సైన్యం చుట్టుముట్టి ఇతరులను అక్కడకు వెళ్లనివ్వడం లేదు. అసద్‌కు మద్దతునిస్తున్న రష్యా, ఇరాన్‌లే ఇందుకు బాధ్యులు. వారే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని ట్రంప్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలనీ, విషవాయువు ప్రయోగం జరిగినట్లు తేలితే సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అస్సద్‌ క్రూరత్వానికి ఇది మరో ఆధారంగా నిలుస్తుందని బ్రిటన్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.  పోప్‌ ఫ్రాన్సిస్‌తో సహా పలు దేశాల అధినేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అయితే, ఈ ఆరోపణలను సిరియా, ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్న రష్యా ఖండించాయి.