చిన్నారి బాలిక లేఖకు ట్రంప్ స్పందన..!

అమెరికాలోని టౌన్ విల్లే ప్రాంతంలో ఓ స్కూలులో చదువుతున్న 7 సంవత్సరాల అవా ఓల్సెన్ ఇటీవలి కాలంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి లేఖ రాసింది.

Updated: Feb 5, 2018, 12:39 PM IST
చిన్నారి బాలిక లేఖకు ట్రంప్ స్పందన..!

అమెరికాలోని టౌన్ విల్లే ప్రాంతంలో ఓ స్కూలులో చదువుతున్న 7 సంవత్సరాల అవా ఓల్సెన్ ఇటీవలి కాలంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి లేఖ రాసింది. తన స్కూలు విద్యార్థి ఒకరు విచక్షణరహితంగా కాల్పులు జరపగా.. ఆ ఘటనలో మరణించిన వారిలో తన మిత్రుడు కూడా ఉన్నాడని ఆమె వాపోయింది. విద్యార్థులలో రోజు రోజుకూ హింసాత్మక ప్రవర్తన పెరిగిపోతుందని.. ఈ విషయంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని ఆమె తెలిపింది.

"డియర్ మిస్టర్ ప్రెసిడెంట్. ఓ విద్యార్థి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల ఘటనలో నా స్నేహితుడు జాకబ్ మరణించాడు. నన్ను బాగా కదిలించిన సంఘటన అది. నేను జాకబ్‌ని ఎంతో ప్రేమించేదాన్ని. మేమిద్దరం మంచి స్నేహితులం. అలాంటి స్నేహితుడిని కాల్పుల్లో పోగొట్టుకున్నాను. ఆ రోజు నుండి నాకు తుపాకులంటే భయం. నేను వాటిని ద్వేషిస్తాను. దయచేసి అలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచేలా మీరు ఏదైనా చేయండి" అని అవా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి ఉత్తరం రాసింది. 

అయితే ఊహించని రీతిలో డొనాల్డ్ ట్రంప్ ఆ బాలికకు ప్రత్యుత్తరం ఇవ్వడం గమనార్హం. ఆయన బదులిస్తూ ఆమె లేఖ తనను కదిలించిందని తెలిపారు. అయితే ఈ లేఖ చదివిన అవా తను ప్రెసిడెంట్‌కు మరో లేఖ రాయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆయన పిల్లలకు భద్రతను ఎలా కల్పిస్తారన్న విషయంపై ప్రెసిడెంట్ జవాబు రాయలేదని పేర్కొంది.

అయినా తన లేఖ చదివి, స్పందనను తెలియజేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపింది అవా. అయితే తాను పిల్లల భద్రత విషయంలో అమెరికన్ ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నానని.. అందుకే మళ్లీ లేఖ రాస్తున్నానని చెప్పింది ఈ చిన్నారి బాలిక. "దయచేసి పాఠశాలలను కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయండి" అని అవా తన తదుపరి ఉత్తరంలో రాసింది.