విజయ్ మాల్యా అప్పగింత కేసు తీర్పుపై లండన్ కోర్టు కీలక ప్రకటన

డిసెంబర్ 10న విజయ్ మాల్యా కేసు తీర్పు : లండన్ కోర్టు 

Updated: Sep 13, 2018, 04:37 PM IST
విజయ్ మాల్యా అప్పగింత కేసు తీర్పుపై లండన్ కోర్టు కీలక ప్రకటన

విజయ్ మాల్యాను భారత్‌కి అప్పగించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌పై డిసెంబర్ 10న తీర్పును వెల్లడించనున్నట్టు లండన్‌లోని వెస్ట్ మినిష్టర్ మెజిస్ట్రేట్ కోర్టు స్పష్టంచేసింది. భారత్‌లో బ్యాంకులకు సుమారు రూ.9000 కోట్లకుపైగా రుణాలు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం బ్రిటీష్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ మాల్యాను భారత్‌కి అప్పగిస్తారా లేదా అనే అంశంపై డిసెంబర్ 10న తీర్పు వెల్లడించనున్నట్టు ఇంగ్లండ్ చీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా అర్బట్‌నాట్ తెలిపారు.     కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వ్యాపారాభివృద్ధి, వ్యాపార నిర్వహణ నిమిత్తం భారత్‌లో వివిధ బ్యాంకుల వద్ద భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా.. అవి చెల్లించకుండానే విదేశాలకు పారిపోయాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ మాల్యాను భారత్‌కి తిరిగి రప్పించేందుకు భారత ప్రభుత్వం లండన్‌కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే లండన్‌లో అరెస్ట్ అయిన విజయ్ మాల్యాకు వెస్ట్ మినిష్టర్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి లండన్ కోర్టులో పలుసార్లు ఈ కేసు విచారణకు వచ్చింది. 

ఈ కేసు విచారణలో భాగంగానే ఇవాళ సైతం విజయ్ మాల్యా లండన్ వెస్ట్ మినిష్టర్ కోర్టు ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తాను దేశం విడిచిరావడానికన్నా ముందుగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి మేటర్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించినట్టు చెప్పాడు. విజయ్ మాల్యా చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌లో పెను దుమారమే రేపాయి. బీజేపీ సర్కార్ విజయ్ మాల్యా దేశం విడిచిపారిపోయేందుకు సహకరించిందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. 2014 నుంచి అసలు తాను విజయ్ మాల్యాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, అటువంటప్పుడు ఇక అతడు తనని కలిసేందుకు ఎక్కడ ఆస్కారం ఉంటుందని ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు.