)
SC Sub Categorisation: సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ కల ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైంది. ఎస్సీ కులాల వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్ర తెలిపింది. ఏకగ్రీవ ఆమోదం తెలిపిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వర్గీకరణ ఉద్యమాన్ని గుర్తుచేసుకున్నారు. మాదిగ కులాల పరిస్థితి.. వారి అభ్యున్నతిపై చంద్రబాబు మాట్లాడారు. వర్గీకరణ ఏపట్టినా ఇంకా అసమానతలపై పోరాటం చేయాలని సూచించారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 'స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా అసమానతలు ఇంకా అలానే ఉన్నాయి. అసమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి వస్తోంది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పాం.. మాట నిలబెట్టుకుంటున్నాం' అని తెలిపారు. మాదిగలకు జరిగిన అన్యాయంపై మందకృష్ణ పోరాడారని ప్రశంసించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పానని వివరించారు. జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
'ఏబీసీడీ కేటగిరి విభజన కోసం 1996లో కమిటీ వేశాం. ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్, కేటగిరీలపై 2000 సంవత్సరంలో చట్టం చేశాం. 2000 సంవత్సరంలో చేసిన చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్ కూడా నివేదిక ఇచ్చింది. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ అధ్యయనం చేసింది. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగింది. మొదటి కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఉండటం నా అదృష్టం' అని సీఎం చంద్రబాబు వివరించారు.
'సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్. పేదల కోసం శాశ్వత గృహనివాస పథకం తీసుకువచ్చిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్' అని సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల కోసం జస్టిస్ పున్నయ్య ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారని గుర్తుచేశారు. అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేశామని తెలిపారు. 'లోక్‌సభ స్పీకర్‌గా ఒక దళితుడిని చేసిన పార్టీ తెలుగుదేశం. లోక్‌సభ స్పీకర్ బాలయోగి ఎంతో బాగా రాణించారు' అని సీఎం చంద్రబాబు చెప్పారు.
'దళిత మహిళను శాసనసభ స్పీకర్‌గా చేసిన ఘనత కూడా టీడీపీదే. ఎస్సీ వ్యక్తి కాకి మాధవరావును సీఎస్ చేసిన ఘనత కూడా టీడీపీదే. యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఎస్సీ వ్యక్తి కేఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతిని చేశాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పేదరికంలో ఉన్న 30 లక్షల కుటుంబాలను దత్తత తీసుకునే ఏర్పాట్లు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook