Amaravati Farmers: ఏపీ రాజధాని అమరావతి భూములిచ్చిన రైతుల పాలిట వరమని నిన్నటి వరకూ ఉన్న వాదన. కానీ ఇప్పుడు అదే శాపంగా మారనుంది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అనవసరపు ఆడంబరాలతో అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ఉన్న భూమికే దిక్కులేదు ఇకా అదనపు భూమి కోసం ప్రయత్నిస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఏపీ రాజధానిగా అమరావతి ప్రకటించి భూ సమీకరణ చేసినప్పుడు చుట్టుపక్కల గ్రామాల రైతులు స్వచ్ఛందంగా 34వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఆ భూముల్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి ఎకరాకు 1000 గజాల స్థలం ఇచ్చేలా ఒప్పందం కుదరింది.
మొత్తం 29 గ్రామాల పరిధిలో 29,881 మంది రైతులు 34,322 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ భూములకు ప్రభుత్వ భూములు కలుపుకుంటే మొత్తం 58 వేల ఎకరాలు అమరావతి నిర్మాణానికి సిద్ధమైంది. 2014-19 మద్యలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం భూములు అభివృద్ధి చేయకుండా తాత్కాలిక భవనాలతో కాలం వెళ్లదీశారు. ఆ తరువాత 2019లో అధికారంలో వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించడంతో తమకు అన్యాయం జరిగిందంటూ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పాదయాత్రలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. ఏపీ హైకోర్టులో కూడా రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఆ తరువాత 2024లో తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రావడంతో అమరావతికి భూములిచ్చిన రైతులు ఆనందించారు. తమ ప్రాంతం అభివృద్ఘి చెందుతుందని భావించారు. అందుకు తగ్గట్టే అమరావతి నిర్మాణ పనుల హడావిడి ప్రారంభించింది ప్రభుత్వం. త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత, అనవసరపు ఆడంబరాలు రైతుల్లో ఆందోళన కల్గిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఇప్పుడున్న 58 వేల ఎకరాలు సరిపోవడం లేదు. మరో 44 వేల ఎకరాలు అవే గ్రామాల్లో సమీకరించేందుకు లేదా సేకరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయంతో రైతులు అవాక్కయ్యారు.
ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం గతంలో తీసుకున్న 34 వేల ఎకరాల భూముల్ని అభివృద్ధి చేసి ప్లాట్లు చేసి ఇస్తే ఆ రైతులకు లాభం కలుగుతుంది. కానీ వాటి జోలికి పోకుండా అవే గ్రామాల్లో అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటే ఈ భూముల విలువ తగ్గిపోవచ్చు లేదా అబివృద్ధే ఆగిపోవచ్చు. ఇప్పటికే అంతంత మాత్రంగా పెరుగుతున్న భూముల ధరలు పడిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ కొత్తగా సమీకరించదల్చిన 44 వేల ఎకరాలు కూడా తాడికొండ, మంగళగిరి, అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లోంచే కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే జరిగితే కచ్చితంగా భూముల విలువ తగ్గిపోనుంది.
Also read: AP Ration Card e KYC: మీ రేషన్ కార్డు ఇ కేవైసీ ప్రక్రియ పూర్తయిందా, ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









