Work From Home: ఏపీలో త్వరలోనే వర్క్ ఫ్రం హోం ప్రారంభం కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వర్క్ ఫ్రం హోం కార్యక్రమంపై ప్రజల్లో ఆసక్తి కన్పిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పని చేసేందుకు దాదాపుగా 41 లక్షల మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇదే జరిగితే ప్రపంచంలోనే అతి పెద్ద వర్క్ ఫ్రం హోం వేదిక కావచ్చు.
రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల వయస్సులో ఉండి వర్క్ ఫ్రం హోం చేసేందుకు సిద్ధమైనవారి డేటా ప్రభుత్వం సేకరిస్తోంది. ఫిబ్రవరి చివరి వారం నుంచి రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సర్వే జరుగుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 41 లక్షల 95 వేల 387 మంది వర్క్ ఫ్రం హోం చేసేందుకు ఆసక్తి కనబర్చగా ఈ సంఖ్య రానున్న రోజుల్లో 55 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. ఇప్పటి వరకూ ప్రభుత్వం 2,69,15,087 మందిని గుర్తించి అందులో 1,65,66,434 మంది అభిప్రాయాలు తెలుసుకుంది. ఇంకా 1,03,48,653 మంది సమాచారం తీసుకోవాల్సి ఉంది. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారు ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఇంటి నుంచి పని చేసేందుకు ఆసక్తి ఉందా లేదా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఇంట్లోంచి పనిచేసేందుకు తగిన స్థలం ఉందా అనే అంశాల్ని అడిగి తెలుసుకుంటున్నారు.
వీరిలో ఇంజనీరింగ్ చదివినవారి సంఖ్య 4,73,372 మంది ఉంటే కామర్స్ డిగ్రీ కలిగినవారు 1,82,089 మంది ఉన్నారు. ఇక ఆర్ట్స్ డిగ్రీతో 1,62,573 మంది ఉన్నారు. ఇతర కోర్సులు చదివిన వాళ్లు 7,65,379 మంది ఉన్నారు. పీజీ చేసిన వాళ్లు 2,67,625 మంది ఉంటే పీహెచ్‌డీ చేసినవారు 5,586 మంది ఉన్నారు. లా చదివిన వారు 4,583 మంది ఉన్నారు. సర్వే పూర్తయ్యేనాటికి మరో 10-15 లక్షలమంది ఎన్‌రోల్ కావచ్చని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధి ఎలా కల్పిస్తారనేది అతిపెద్ద సవాలుగా మారింది.
అయితే ఇది ప్రభుత్వం ఆలోచన మాత్రమే. వర్క్ ఫ్రం హోంకు సహకరించాల్సింది వివిధ కంపెనీలు. ఈ కంపెనీల ఆలోచన ఎలా ఉందనేది ఇంకా తెలియదు. ఎందుకంటే ప్రొడక్టివిటీ తగ్గిందనే కారణంతో చాలా కంపెనీలు కరోనా తరువాత వర్క్ ఫ్రం హోం తొలగించాయి. వర్క్ ఫ్రం హోం లేకపోవడం వల్ల ఇతర ఖర్చులు పెరిగి ఇతర వ్యాపారాల ఆదాయం పెరుగుతుంది. మనీ ఫ్లో కన్పిస్తుంది. అప్పుడే ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఈ నేపధ్యంలో వర్క్ ఫ్రం హోం ఆలోచన ఏ మేరకు ప్రయోజనం కల్పిస్తుందనేది తెలియడం లేదు.
అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం వద్దంటున్న సమయంలో ఏపీ ప్రభుత్వం అదే వర్క్ ఫ్రం హోం కోసం ప్రయత్నించడం ఏ మేరకు సమంజసమనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఒకవేళ ఇది సాకారమై అంతమందికి వర్క్ ఫ్రం హోం కల్పించగలిగితే ప్రపంచంలోనే అతి పెద్ద వర్క్ ఫ్రం హోం వేదిక కాగలదు.
Also read: IPL 2025 KKR vs SRH: ఐపీఎల్ 2025 కేకేఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ డూ ఆర్ డై మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









