ఇ-రైతుతో రైతన్నకు ఎంతో లాభం : చంద్రబాబు

ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Updated: Sep 13, 2018, 04:36 PM IST
ఇ-రైతుతో రైతన్నకు ఎంతో లాభం : చంద్రబాబు

సమాచార సాంకేతిక రంగ విప్లవంతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఏపీ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఉపయోగించుకుంటున్నట్టు చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. బుధవారం అమరావతిలో 'ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్'‌ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. భూగర్భ జలాల లభ్యత నుంచి మొదలుపెడితే, ఎప్పుడు, ఎక్కడ పిడుగులు పడతాయనే సమాచారం వరకు రియల్‌టైమ్‌లో సమాచారాన్ని అందించే వ్యవస్థలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. 

AP CM Chandrababu Naidu launches e-Rythu digital marketing Network

ఇ-రైతు డిజిటల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయడం ఒక విప్లవం అని చెబుతూ.. ఈ విధానం మొట్ట మొదట ఏపీలోనే ప్రారంభం అవుతుండటం మరింత విశేషం అని అన్నారు. 'ఇ-రైతు' డిజిటల్ మార్కెట్ పంటల సాగు, ఉత్పత్తుల వివరాలు తెలుసుకోవడంతోపాటు తమ ఉత్పత్తులను ప్రపంచంలో ఎక్కడైనా విక్రయంచుకునే అవకాశం రైతులకు లభిస్తుందని తెలిపారు. రైతన్నాల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని 'ఇ-రైతు' డిజిటల్ మార్కెట్ నెరవేరుస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.