)
AP Govt Big Gift: పండుగల సందర్భంగా నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ప్రకటనలు వేస్తామని ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రతి సంవత్సరం డీఎస్సీ ప్రకటన వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'బాబు ష్యూరిటీ.. జాబు గ్యారెంటీ నినాదాన్ని నిజం చేస్తున్నాం. అత్యంత పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టాం. విద్యార్థులకు టీచర్లు నైతిక విలువలు బోధించాలి. ఉపాధ్యాయులూ నిత్యం అప్డేట్ అవుతూ ఉండాలి' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది డీఎస్సీలో క్వాలిఫై కాని వారంతా ప్రిపేర్ అవుతూ ఉండాలని.. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. దాని కోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
మెగా డీఎస్సీలో 15,941 మంది ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను గురువారం అమరావతిలోని సచివాలయం సమీపంలో పంపిణీ చేశారు. కొత్త టీచర్లకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం మెగా డీఎస్సీ పత్రంపైనే పెట్టానని గుర్తుచేసుకున్నారు. అవినీతి లేకుండా పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టామని.. 150 రోజుల్లో ఈ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టారని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బాబు ష్యూరిటీ.. జాబు గ్యారెంటీ అని చెప్పా. దాన్ని నిజం చేస్తున్నామని చెప్పారు. రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని వివరించారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
సూపర్ సిక్స్ హామీల్లో మొదటి హామీ యువతకు 20 లక్షల ఉద్యోగాలివ్వడమేనని సీఎం చంద్రబాబు తెలిపారు. 'మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేశారు. పేదరికం లేని సమాజం చూడాలనేది నా కోరిక. పేదరికం లేని సమాజాన్ని చూడాలంటే విద్యతోనే సాధ్యం. దాన్ని టీచర్లే నెరవేర్చాలి' అని స్పష్టం చేశారు. 'మహిళలే మంచిగా చదువు చెబుతారు. ఇంటిని కూడా మహిళలే చక్కగా తీర్చిదిద్దుతారు. అందుకే సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం' అని చంద్రబాబు వివరించారు.
'స్త్రీ శక్తితో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. దీపం పథకం అమలు చేస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా.. వారందరికీ రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. ప్రధాని సూపర్ జీఎస్టీ తెచ్చారు. ధరలు తగ్గించారు. దసరా, దీపావళి పండుగలను ఆనందంగా చేసుకోవాలి' అని సీఎం చంద్రబాబు వివరించారు. అభివృద్ధితో ఉద్యోగాలు వస్తాయిని.. దానిద్వారా ఆదాయం పెరిగి సంక్షేమం సజావుగా సాగించవచ్చని తెలిపారు.
తాను విద్య పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టానని.. తాను ఒక్కడినే భారీ ఎత్తున టీచర్ల నియామకం చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వివరించారు. విద్యా రంగాన్ని తాను ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదని.. నిర్లక్ష్యం చూపలేదని చెప్పారు. టీచర్లుగా బాధ్యతలు తీసుకున్న మీరంతా బాగా పని చేయాలి.. మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేలా టీచర్లంతా పని చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook