DA Hike 2025: 'నాలుగు డీఏలు, 30 శాతం ఐఆర్‌ చెల్లించాలి'.. ప్రభుత్వానికి డిమాండ్

Andhra Pradesh Govt DA Hike News: దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. మధ్యంతర భృతి కనీసం 30 శాతం ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 10, 2025, 11:03 PM IST
DA Hike 2025: 'నాలుగు డీఏలు, 30 శాతం ఐఆర్‌ చెల్లించాలి'.. ప్రభుత్వానికి డిమాండ్

Andhra Pradesh Govt DA Hike News: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడిచిపోతున్నా ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, వారు హక్కుగా పొందాల్సిన వాటిని సైతం ఇవ్వకుండా వేధిస్తోందని YSRCP ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడల్లా ఈసారైనా ఉద్యోగుల హామీలపై నిర్ణయం తీసుకుంటారని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడటమే తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రెండేళ్లలో నాలుగు డీఏలు పెండింగ్‌లు పెట్టడమే కాకుండా ఇప్పటికీ 12వ పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు చేయకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలోనైనా మధ్యంతర భృతి (IR) కనీసం 30 శాతం ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇంకా దీపావళి సందర్భంగానైనా కొత్త PRC ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Add Zee News as a Preferred Source

"ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్‌ బకాయిలు రూ.30 వేల కోట్లకు పెరిగిపోయినా వాటిని చెల్లించే ఆలోచన చేయడం లేదు. మొన్న దసరా సందర్భంగానైనా కొన్ని హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తే వారి ఆశలపై నీరు చల్లింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తే కార్పొరేట్‌ సంస్థలకు భూములు పందేరం పెట్టడానికే జరుగుతున్నట్టుంది తప్పితే ప్రజా సమస్యలు, రాష్ట్ర అవసరాలు, ఉద్యోగుల కష్టాలపై దృష్టి సారించినట్టు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో నైనా మధ్యంతర భృతి కనీసం 30 శాతం ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని వైయస్సార్సీపీ ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.

అలాగే సీపీఎస్, జీపీఎస్‌ ల మీద సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలి. 3 లక్షలకు పైగా ఉన్న సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేయాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ తదితర బకాయిలకు సంబంధించిన రూ.30 వేల కోట్లు తక్షణం విడుదల చేయాలి. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా తక్షణం పీఆర్సీ ఏర్పాటు చేయాలి. అధికారంలోకి వచ్చిన తక్షణం మధ్యంతర భృతి ఇస్తామని చెప్పారు. ఆ ప్రకారం ఇప్పటికైనా 30 శాతానికి తగ్గకుండా దీపావళి కానుకగా ఐఆర్‌ ప్రకటించాలి. ఎట్టి పరిస్థితుల్లో పండగ సందర్భంగా నాలుగు డీఏలను  విడుదల చేయాలి. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం ఉద్యోగుల నుంచి ప్రభుత్వం ప్రతినెలా రూ.300 లు వసూలు చేస్తుంది. దానికి ప్రభుత్వం వాటా కలిపి ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉండగా, ఆ పని చేయకపోగా ఉద్యోగులు చెల్లించిన నిధులను ప్రభుత్వమే ఖర్చు చేస్తుంది. దీంతో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఇంకా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు తక్షణం చెల్లించి ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్‌ ట్రీట్మెంట్‌ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.

పీజీ సీట్లల్లో ఉన్న రిజర్వేషన్‌ 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారని, దాన్ని గతంలో మాదిరిగా 20 శాతం చేయాలని పీహెచ్‌సీల్లో పని చేస్తున్న డాక్టర్లు డిమాండ్‌ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. తక్షణం వారి సమస్యను పరిష్కరించాలి. 25 ఏళ్లుగా ఒకే కేడర్‌ లో పని చేస్తున్నా తమకు ప్రమోషన్లు లేక గుర్తింపు దక్కడం లేదని వారు బాధ పడుతున్నారు. వారికి తక్షణం న్యాయం చేయాలి. వాలంటీర్లను తీసేసి మాతో ఆ పనులు చేయిస్తున్నారని గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబ్‌ డ్యూటీని పక్కాగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నోషనల్‌ ఇంక్రిమెంట్స్, ఆరేళ్లకోసారి ప్రమోషన్లు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ కల్పించాలని కోరుతున్నారు. న్యాయంగా వారికి దక్కాల్సిన అంశాలను సైతం పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. తమకు రావాల్సిన రాయితీల కోసం టీచర్లు ఇటీవలే విజయవాడలో ధర్నా నిర్వహించారు. యాప్‌ల భారం భరించలేకపోతున్నామని ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఉద్యోగ జేఏసీలన్నీ ప్రభుత్వ మోసాల మీద తిరుగుబాటు చేస్తున్నాయి. తక్షణం ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలు తీవ్రం చేస్తాం" అని నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News