)
Mega DSC Final List: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ–2025 తుది ఎంపిక జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 15న విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. రెండు విడతల్లో నిర్వహించిన పరీక్షలకు లక్షలాది మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. ప్రాథమిక కీని జూలై 5న విడుదల చేసిన ప్రభుత్వం, అభ్యంతరాలను పరిశీలించి ఆగస్టు 1న ఫైనల్ కీని ప్రకటించింది. అనంతరం అభ్యర్థుల సర్టిఫికెట్ల ధ్రువీకరణను పూర్తి చేసి, ఇప్పుడు తుది జాబితాను అధికారికంగా ప్రకటించింది.
ఈ తుది జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/ లో చూడవచ్చు. అదనంగా, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నియామకాలు జరిగేలా తదుపరి దశలు కొనసాగుతాయని స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా డీఎస్సీ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని.. ఇది విద్యా రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహణ జరుగుతుందని హామీ ఇస్తూ, ఈసారి ఎంపికలో రాలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని సూచించారు. ఈ ఫలితాలు ఉపాధ్యాయులుగా చేరబోయే వారికి మరింత బాధ్యతను తీసుకువస్తాయని లోకేశ్ పేర్కొన్నారు.
డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఏప్రిల్ 20న విడుదలైంది. ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మున్సిపల్, గిరిజన, సామాజిక, బీసీ, బాలల సంక్షేమం, మోడల్, రెసిడెన్షియల్, ప్రత్యేక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు సమర్పించారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూన్ 6 నుండి జూలై 2 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. జూలై 5న ప్రిలిమినరీ కీని, ఆగస్టు 1న ఫైనల్ కీని ప్రకటించారు. అభ్యర్థుల టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఇచ్చి, తుది ఎంపికలో పరిగణించినట్లు డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి వెల్లడించారు. అలాగే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏడు దశల్లో పూర్తయిందని చెప్పారు. మొత్తం మీద, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు వెలువడటంతో వేలాది కుటుంబాల్లో ఆనందం నెలకొంది. కొత్త ఉపాధ్యాయుల నియామకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత పెరుగుతుందని, ఖాళీ పోస్టులు భర్తీ కావడంతో విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.