)
AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విషయం ఎప్పుడూ చర్చనీయాంశమే. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాలపై ఇప్పటికీ వివాదాలు సాగుతున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. సరిహద్దుల సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోగా.. మూడు కొత్త జిల్లాలు రానున్నాయని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే కమిటీ నివేదిక తెచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని సమాచారం. ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మార్చారు. దీంతో కొత్త డిమాండ్లు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా పేరును విజయవాడగా మార్చాలని కొందరు చెబుతున్నారు. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 గా చేసింది. కొన్ని జిల్లా కేంద్రాలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఈ గందరగోళాన్ని తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పులపై అధ్యయనం చేస్తుంది.
మంత్రివర్గ ఉపసంఘం ప్రజల నుంచి వినతులు తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే నివేదిక ఇవ్వనుంది. రెండు లేదా మూడు జిల్లాలు ఏర్పాటు చేసి కొన్ని సరిహద్దులు మారుస్తారని అంటున్నారు. త్వరలో జనగణన జరగనుంది. 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు సరిహద్దులు పేర్ల మార్పులు చేయకూడదు. అందుకే 2025 డిసెంబరు 31 లోగా ఈ నిర్ణయాలు తీసుకోవాలి.
ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. గిద్దలూరు కనిగిరి మార్కాపురం యర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలతో ఇది ఏర్పడవచ్చు. బాపట్ల జిల్లాలో అద్దంకి నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపితే మంచిదని భావిస్తున్నారు. అప్పుడు ఒంగోలు కొండపి సంతనూతలపాడుతో కలిపి ఐదు నియోజకవర్గాలు అవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదేసి ఉంటాయి.
అమరావతి కేంద్రంగా కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు ఆలోచన ఉంది. రాజధాని పరిధిలో 29 గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల్లో ఉన్నాయి. పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేటలు దగ్గరగా ఉన్నాయి. ఇవి కలిపి ఐదు నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడవచ్చు. గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి కలిపి ఐదు అవుతాయి. కృష్ణా జిల్లాలో గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే మంచిదని చూస్తున్నారు. అప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ సెంట్రల్, తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు కలిపి ఏడు అవుతాయి.
కృష్ణా జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండవచ్చు. ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరం నుంచి పాడేరు జిల్లా కేంద్రానికి 187 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇది ఇబ్బందికరం. రంపచోడవరం డివిజన్, చింతూరు డివిజన్ లోని నాలుగు మండలాలు కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే మంచిదని అంటున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా ఇంకా సమయం తీసుకుంటారా చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook