AP Politics: ఏ ఎండకా గొడుగు పట్టే నేతల్లో తాజాగా వైసీపీ మాజీ నేత, బీసీ ఉద్యమనేతగా ఉనికిలో ఉన్న ఆర్ కృష్ణయ్య చేరిపోయారు. ఒకప్పుడు బీసీ హక్కులే లక్ష్యంగా ఉద్యమం చేసి రెండు రాష్ట్రాల్లోనూ పేరు తెచ్చుకున్న ఆర్ కృష్ణయ్య ఇప్పుడదే సంఘం పేరు చెప్పుకుని అవకాశవాద రాజకీయాలకు తెరలేపారనే విమర్శలు విన్పిస్తున్నాయి.
మొన్నటి వరకూ వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య ఫక్తు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం వెన్నంటి ఉన్న ఆయన ఆ తరువాత ఆ పార్టీ నుంచి ప్రయోజనం లభించనందున వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ ఎలానూ బీసీ మంత్రం పఠిస్తున్నందున కృష్ణయ్యకు ప్రతిఫలం త్వరగానే దక్కింది. రాజ్యసభ సభ్యుడిగా పంపించారు. వైఎస్ జగన్ ఆయన్ను పిలిచి మరీ రాజ్యసభకు పంపించారు. ఆ సమయంలో కృష్ణయ్య చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు బీసీ సంఘాలు గుర్తు చేసుకుంటున్నాయి. తన ప్రాణం పోయేవరకూ వైసీపీలో ఉంటానని, పడుకుంటే లేపి మరీ రాజ్యసభకు పంపించారని చెప్పారు.
కట్ చేస్తే 2024లో వైసీపీ అధికారం కోల్పోయింది. కానీ ఆర్ కృష్ణయ్యకు ఇంకా పదవీకాలం రెండేళ్లు పైనే ఉంది. కూటమి ప్రభుత్వంతో మాట్లాడుకుని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ పిలిచి మరీ టికెట్ ఇచ్చిందని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న ఆర్ కృష్ణయ్య రెండేళ్ల క్రితం వైసీపీ రాజ్యసభకు పంపించినప్పుడు చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోయినట్టున్నారు. ఆయన మర్చిపోవచ్చేమో బీసీ నాయకులు మర్చిపోరు కదా. ఇప్పుడా వ్యాఖ్యల్నే గుర్తు చేస్తున్నారు. ఉన్న పదవిని వదులుకుని బీజేపీ పిలిచి ఇచ్చిందనడం ఏ మేరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం తరపున బీజేపీ అభ్యర్ధిగా రాజ్యసభకు ఆయన ఎన్నిక లాంఛనమే. కానీ బీసీ ఉద్యమనేతగా ఆయన ప్రతిభ, ప్రాభవానికి పడుతున్న మచ్చల గురించి పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఇప్పుడు బీసీలకు నేతల అవసరం లేదు. ఉద్యమాల అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే పార్టీలే బీసీలకు అడగకుండా అన్నీ ఇచ్చేస్తున్నాయి. ఆర్ కృష్ణయ్య లాంటి నేతలు భవిష్యత్తులో మరెన్ని జెండాలు మారుస్తారో వేచి చూడాలి.
Also read: Jamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.