జగన్ సర్కార్ కు ఝలక్: పోలవరం రివర్స్ టెండరింగ్‌ను వ్యతిరేకిస్తున్న కేంద్రం ?

పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేంద్రం వ్యతిరేకిస్తోంది  

Last Updated : Aug 19, 2019, 11:43 PM IST
జగన్ సర్కార్ కు ఝలక్: పోలవరం రివర్స్ టెండరింగ్‌ను వ్యతిరేకిస్తున్న కేంద్రం ?

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం పోలవరం ప్రాజక్టు అథారిటీ (పీపీఏ) సూచనలను పట్టించుకోకుండా జగన్ సర్కార్ రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్లడాన్ని ఆగ్రహించిన కేంద్రం...దీనిపై పూర్తిస్థాయి నివేదిక పంపాలని  పీపీఏ సీఈవోను ఆదేశించింది. కేంద్రం ఆదేశాల మేరకు పీపీఏ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను తయారు చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితి, రివర్స్ టెండరింగ్‌తో ఎదురయ్యే సమస్యలను నివేదికలో రూపంలో తెలియజేయనున్నారు. ఈ నివేదికగా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో చర్యలు తీసుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఊహించని ఎదురుదెబ్బ...

చంద్రబాబు హయంలో జరిగిన కాంట్రాక్టులపై పున:సమీక్షకు వెళ్తున్న జగన్ సర్కార్.. పోలవరం విషయంలోనూ రివర్స్ టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టులో అక్రమాలు జరిగాయన్నదే జగన్ సర్కార్ ప్రధాన  ఆరోపణ. ఈ కారణం చేత జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు మొగ్గుచూపింది. అయితే అనుకోని విధంగా జగన్ సర్కార్ కు పీపీఏ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. మళ్లీ టెండర్లు పిలవడం వ్యయభరితం అని చెప్పిన పోలవరం ప్రాజక్టు అథారిటీ.. రీ టెండరింగ్  వద్దని సలహా ఇచ్చింది.  అయితే ఈ సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లకు మొగ్గు చూపింది. ఈ చర్యతో ఆగ్రహించిన కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

జగన్ సర్కార్ కు దెబ్బ దెబ్బ..

ఇటీవలె పోలవరం ప్రాజెక్టు విషయంలో పర్యవరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని జగన్ సర్కార్ కేంద్ర పర్యావరణశాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రీ టెండరింగ్ పై కేంద్రం మెలిక పెట్టడం జగన్ సర్కార్ కు ఇబ్బందికరంగా పరిగణిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Trending News