ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కేంద్రం పాజిటివ్ వైఖరితో ఉన్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే 557 కిమీ అమరావతి ఎక్స్ప్రెస్ వే ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అందినట్లు చెబుతున్నారు. అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా రాజధాని అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు, కడపలను అనుసంధానం చేసే 557 కిలోమీటర్ల ఆరు వరుసల రహదారికి రూ.25వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన డీపీఆర్ తయారుచేస్తోంది. ఇందులో భాగంగా అమరావతి ఔటర్ రింగ్రోడ్డు-180 కిమీలకు గాను రూ.20 వేల కోట్ల విలువైన రాజధాని భాహ్య వలయ నిర్మాణానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది.


జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ దీన్ని డీపీఆర్ తయారు చేస్తోంది. అలాగే రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ.2500 కోట్లు కేంద్రం కేటాయించింది. అలాగే రూ.7,500 కోట్ల హడ్కో రుణం మంజూరు చేసింది. అలాగే విశాఖపట్నానికి సంబంధించి ప్రస్తుతం డీపీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉంది. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరడం జరిగింది. అలాగే విజయవాడ మెట్రోకి సంబంధించి సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపినట్లు సమాచారం. ఈ విషయమై ఇటీవలి కాలంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం సోషల్ మీడియాలో కూడా వార్తలను ప్రకటించింది.