)
Good News To AP Women: మహిళలకు సీఎం చంద్రబాబు మరో శుభవార్త ప్రకటించారు. ఇప్పటికే ఉచిత బస్సు పథకం అమలు చేయగా.. మరికొన్నింటిని అమలు చేసిన ఎన్డీయే ప్రభుత్వం తాజాగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. స్వయం సహయక మహిళలకు కొన్ని గంటల్లోనే బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు ఇచ్చారు.
'మహిళాభివృద్ధికి ఉన్న అవకాశాలన్నీ వినియోగించండి. డ్వాక్రా, మెప్మా ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలి. ఉత్పత్తుల వారీగా రాష్ట్రంలో క్లస్టర్లు ఏర్పాటు చేయండి. స్టార్‌బక్స్ తరహాలో అరకు, మిల్లెట్ ఔట్లెట్లు ఏర్పాటుచేయాలి. డ్వాక్రా, మెప్మా విభాగాలను ఒకే గొడుగు కింద తెచ్చే అంశాన్ని పరిశీలించాలి' అని సీఎం చంద్రబాబు సెర్ప్-మెప్మా అధికారులకు ఆదేశించారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సెర్ప్, మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే అంశంపైన చర్చించారు. డ్వాక్రా, మెప్మా సంఘాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను అధికారులు వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళలను శక్తిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటు తర్వాత వాళ్లల్లో చాలా చైతన్యం వచ్చిందని.. వారిలో ఉన్న ప్రతిభ వెలికి తీసేలా అధికారులు కసరత్తు చేయాలని సూచించారు.
'డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసే రోజుల్లో చాలా మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. నిరక్షరాస్యులుగా ఉన్న మహిళల్లో చైతన్యం తెచ్చి అద్భుతాలు సృష్టించాం. ఇప్పుడు మహిళ సంఘాలు రూ.20,739 కోట్లను పొదుపు చేయగలుగుతున్నారు. దీనికి రెండింతలు బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకోగలుగుతున్నారు' అని సీఎం చంద్రబాబు వివరించారు. మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడంలో ముందుంటారని పేర్కొన్నారు.
'ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో డ్వాక్రా మహిళలకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సుమారు 99 శాతం మందికి పైగా మహిళలు తాము తీసుకున్న బ్యాంకు రుణాలను చెల్లిస్తున్నారు. కేవలం 0.02 శాతం మంది మహిళల మాత్రమే వెనక్కి తగ్గుతున్నారు. ఇంతటి పెద్ద నెట్వర్క్ ఎక్కడా ఉండదు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి' అని అధికారులకు సీఎం చంద్రబాబు చెప్పారు. మహిళలను పొదుపు ప్రోత్సహించడం.. వారిని వ్యాపారులుగా.. పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడంలో పూర్తి సహకారం అందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉంటే.. అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్ని రకాల చేయూత ఇవ్వాలని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. గంటల్లోనే రుణాలు అందించాలని చెప్పారు.
యాప్‌లు ఆవిష్కరణ
మెప్మా-మన మిత్ర యాప్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మెప్మాకు సంబంధించిన 8 రకాల సేవలను యాప్‌లో అందుబాటులో ఉంచారు. మెప్మా చేపట్టే కార్యక్రమాలు, కార్యకలాపాలను వివరిస్తూ రూపొందించిన అవని వార్షిక సంచికను ఆవిష్కరించారు. ప్రగ్న్యా యాప్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా మెప్మా సభ్యులకు వర్చువల్ ట్రైనింగ్ అందిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook