
Chandrababu Naidu Serious On MLAs: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది కావొస్తోంది. అటు ప్రభుత్వాన్ని ఇటు.. పార్టీని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదులోనూ అధికార పార్టీకి కొత్త రికార్డు సృష్టించింది. కానీ.. కొన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదులో మాత్రం కొందరు నేతలు పూర్తిగా వెనకబడ్డారు. అటు ప్రభుత్వంలోనూ యాక్టివ్‌గా కనిపించడం లేదు.. దాంతో వారికి సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు.. అప్పట్లో మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్ తీసుకున్న ఆడియో నెట్టింట సంచలనం రేపింది. ఆ ఘటన మరువకముందే.. సీఎం మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం హాట్‌టాపిక్ అయ్యింది..
తాజాగా ప్రకాశం జిల్లా, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నాయరాయణ రెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయినట్టు తెలుస్తోంది. మార్కాపురంలో పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించినట్టు సమాచారం. అటు పార్టీ సభ్యత్వ నమోదులోనూ వెనుకబడ్డారని క్లాస్ పీకారట. ఇప్పటివరకు లోకల్‌గా జిల్లా అధికారులు 8 సమావేశాలు నిర్వహిస్తే.. కేవలం మూడుసార్లు హాజరుకావడం ఏంటని ప్రశ్నించారట. పార్టీ అధికారంలో ఉండగా.. ఇదేం ధోరణి అంటూ మండిపడ్డట్టు తెలిసింది. అంతేకాదు తన పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఒకసారి గెలుస్తాను మరోసారి ఓడిపోతాను అనేది కాదు. శాశ్వతంగా గెలిచేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారట. అటు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టినా వాటిని ప్రజలకు ఎందుకు వివరించడం లేదంటూ ఎమ్మెల్యేను నిలదీసినట్టు తెలిసింది. మన ప్రభుత్వం చేసిన అబివృద్ది సంక్షేమ కార్యక్రమాలను మనమే ప్రజలకు చెప్పుకోకపోతే ఎలా అంటూ ఎమ్మెల్యేను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలిసింది.
మరోవైపు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపైన సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. విజయవాడలో ఎక్సైజ్ ఆఫీసు కార్యాలయంపై దాడి కేసులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారట. తాజాగా ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాయలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలంటూ ఎమ్మెల్యే చదలవాడ హంగామా సృష్టించారు. ఎక్సైజ్ కమిషనర్ వచ్చే వరకు మూడు గంటల పాటు ఆయన ఛాంబర్‌లోనే బైఠాయించారు. ఆ తర్వాత కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. గత ప్రభుత్వంలో నియమించిన 10 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలా కంటిన్యూ చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ విషయం తెలిశాక ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు సర్ధిచెప్పినా వినిపించుకోలేదట. వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ నిరసనకు దిగడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయినట్టు తెలిసింది. ఆ వెంటనే ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీ వర్గాలను ఆదేశించినట్టు సమాచారం. అయితే సీఎం చంద్రబాబు చదలవాడపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని కేడర్ మొత్తం టెన్షన్ పడుతోంది.
అంతకుముందు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యత్వాల నమోదులో రామచంద్రాపురం నియోజకవర్గంలో పూర్తిగా అట్టడుగున ఉండటంతో సీఎం చంద్రబాబు మంత్రికి నేరుగా ఫోన్ చేశారు. మంత్రి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అనుభవం లేకపోయినా.. తొలిసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చానని.. అంతేకాకుండా మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటివరకు కేవలం 29 శాతం మాత్రమే పార్టీ సభ్యత్వ నమోదు చేయడంతో పాటు తొమ్మిది వేల మంది పట్టభద్రుల ఓట్లు నమోదుకు లక్ష్యంగా పెడితే కేవలం 2 వేల 300 ఓట్లు మాత్రమే చేయడంతో సీఎం చంద్రబాబు నుంచి మంత్రి సుభాష్‌కు చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది.
మరోవైపు కేవలం పార్టీ కార్యక్రమాల్లో వెనుకబడి ఉండటమే కాకుండా మంత్రి సుభాష్ పై వివాదాలు, ఆరోపణలు ఉండడం కూడా వార్నింగ్ ఇవ్వడానికి కారణంగా తెలుస్తోంది. అయితే కొంతకాలంగా మంత్రి సుభాష్ తన జిల్లాను వదిలి కాకినాడలో ప్రైవేట్ కార్యక్రమంలలో పాల్గొంటున్న విషయంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు సైతం వెళ్లినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. జనసేన అధినేత కూడా పార్టీ లైన్ దాటిన లీడర్లకు చుక్కలు చూపిస్తున్నారు. మహిళా దినోత్సవం రోజునే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులపై జనసేన ప్రత్తిపాడు ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు దాడి చేశారు. వైద్యులు, సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఈ ఘటన నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. వెంటనే అతనిపై అధికారులు చర్యలు తీసుకోవచ్చని పవన్ ఆదేశించారు. మరోపక్క పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుని విచారణ జరపమని ఆదేశించారు.
తుమ్మలబాబు ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో చర్చలు జరిపారు. ఆతర్వాత పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు వేములపాటి అజయ్ తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా తప్పు చేస్తే వదిలేది లేదు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఇంత వేగంగా నిర్ణయం తీసుకున్నారని జన సైనికులు చెబుతున్నారు. మరో నాలుగు రోజుల్లో జనసేన ఆవిర్భావ సభ జరగనున్న సందర్భంలో ఓ నాయకుడిని సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. అధికారులు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
మొత్తంగా సీఎం చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ పార్టీలో ఎవరైనా నేతలు క్రమశిక్షణను ఎవరైనా ఉల్లంఘిస్తే.. వెంటనే యాక్షన్ లోకి దిగుతున్నారు. ఈ విషయంలో తగ్గేదేలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దాంతో పార్టీ నేతలు కూడా ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. ఏవైపు నుంచి ఆపదలు చుట్టుముడతాయో అని టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఏదీఏమైనా త్వరలోనే మరికొందరు నేతలపైన సీఎం చంద్రబాబు ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe