)
Ganesh Chaturthi: ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సుఖ సంతోషాలతో.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని వినాయకుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు. గణేష్ చతుర్థతి అంటే తనకు తనకు చాలా ఇష్టమని.. చిన్నతనం నుంచి ఈ పండుగను బాగా చేసుకునే వాళ్లమని గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వంలో గణేశ్ ఉత్సవాలు చేసుకోవాలంటే అన్నీ విఘ్నాలేనని తెలిపారు.
విజయవాడలోని సితార సెంటర్లో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 72 అడుగుల మహాగణపతిని బుధవారంముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. 'గత ప్రభుత్వంలో పండుగ చేసుకోవాలన్నా.. మైక్ పెట్టాలన్నా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. ప్రతి దానికీ అనుమతులు తీసుకోవాలని ఇబ్బందులు పెట్టారు. కానీ ప్రజా ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు లేకుండా గణేశ్ మండపాలను ఉచిత విద్యుత్ అందిస్తున్నాం' అని తెలిపారు. ఉచిత విద్యుత్ ఇవ్వడంతో ప్రభుత్వంపై రూ.30 కోట్ల భారం పడుతోందని చెప్పారు.
దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి, సంక్షేమం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసి వాడవాడలా బ్రహ్మాండంగా గణేశ్ ఉత్సవాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్ట పరిచేలా సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చినట్లు వివరించారు.
వర్షాలు పుష్కలంగా పడి అన్ని జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. గతేడాది వచ్చిన బుడమేరు వరదను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకున్నామని.. బుడమేరుకు వరద రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సర్వవిజ్ఞాలను తొలగించే విగ్నేశ్వరుడి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీశా, డూండీ గణేష్ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన నాయకులు
సీఎం చంద్రబాబు పాల్గొన్న పూజకు పెద్ద ఎత్తున విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పాల్గొన్నవారిలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రాష్ట్ర నూర్ బాషా, దూదేకుల సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, నగరాల సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ల తిరుమలరావు, నాగవంశం సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పెరిపి ఈశ్వర్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.