)
Cyclone Montha Live Updates: బంగాళాఖాతంలో మొంథా తుఫాను తీవ్రరూపం దాల్చింది. మంగళవారం (అక్టోబరు 28) రాత్రికి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఈ తుఫాను తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలియజేసింది. తుఫాను కారణంగా ఏపీలోని కాకినాడ, కృష్ణా జిల్లా, నెల్లూరు సహా అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు తెలంగాణలోనూ అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తుఫాను కదలికలు ఉన్నాయి. మొంథా తుఫాను ప్రస్తుతం చెన్నైకి 600 కి.మీ దూరంలో.. కాకినాడకు 680 కి.మీ, వైజాగ్‌కు 710 కి.మీ దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. సోమవారం (అక్టోబరు 27) ఈ తుఫాను మరింత బలపడి.. తర్వాతి రోజు అనగా మంగళవారం నాటికి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాను తీరం దాటే క్రమంలో గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. ఈ భారీ తుఫాను కారణంగా ఏపీ అంతటా, తెలంగాణలో మోస్తారు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇవాళ ఈ జిల్లాల్లో
అక్టోబరు 27 అనగా సోమవారం నాడు ప్రధానంగా కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ జిల్లాలన్నింటికి రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వివరించారు. అలాగే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబరు 27, 28, 29 తేదీల్లో ఈ జిల్లాలన్నింటికి రెడ్ అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలోని తుఫాను ప్రభావం..
ఏపీతో పాటు మరోవైపు తెలంగాణలోనూ మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. మంగళవారం, బుధవారాల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేపు అనగా అక్టోబరు 28 నుంచి ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి తీవ్ర వర్షపాతం కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. వీటితో పాటు మంచిర్యాల, కొమురంభీం, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఈ జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.
ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్..
మొంథా తుఫాను హెచ్చరికల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. తీవ్ర తుఫాను కారణంగా అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వారు కోరారు. మొంథా తుఫాను కారణంగా తీవ్ర ప్రభావం ఉన్న జిల్లాలైన కాకినాడ, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. రాబోయే 4 రోజుల పాటు ఈ సెలవులు ఉంటాయని ఆయా జిల్లా కలెక్టర్లు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. అలాగే అత్యవసర సమయంలో ప్రజలు కంట్రోల్ రూమ్‌లను ఆశ్రయించాలని అధికారులు తెలిపారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సెలవులను రద్దు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook