Yanamala Ramakrishnudu: టీడీపీ నుంచి యనమల ఎడబాటు.. ఆ కారణంతోనే గుడ్‌ బై..?

Yanamala Ramakrishnudu: ఏపీ టీడీపీలో ఆయనో సీనియర్‌ లీడర్‌.. మొన్నటి వరకు నెంబర్‌ టుగా కొనసాగిన ఆయనకు.. ఎమ్మెల్సీగా ప్రమోషన్ దక్కలేదు..! దాంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అటు సీఎం చంద్రబాబు కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు..! ఈ నేపథ్యంలో రాజకీయాలకు ఆయన గుడ్‌ బై చెప్పేందుకు సిద్దమయ్యారా..! ఆయన పాలిటిక్స్‌కు గుడ్‌బై చెబితే.. ఆ జిల్లాలో పార్టీని ముందుండి నడిపే కథనాయకుడు ఎవరు..!  

Written by - G Shekhar | Last Updated : Apr 9, 2025, 08:10 PM IST
Yanamala Ramakrishnudu: టీడీపీ నుంచి యనమల ఎడబాటు.. ఆ కారణంతోనే గుడ్‌ బై..?

Yanamala Ramakrishnudu: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో యనమల రామకృష్ణుడిది ప్రత్యేక స్థానం. 1982 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆయన పార్టీలో చేరారు. లాయర్ గా ప్రాక్టీస్ చేసుకుంటున్న ఆయన్ను నందమూరి తారకరామారావు తుని నియోజకవర్గం నుంచి ఆహ్వానించారు. దాంతో ఆయన పార్టీలో చేరారు. అక్కడి నుంచి ఆయన అప్రతిహతంగా ఎదుగుతూ వచ్చారు. 1983, 85, 89,94, 99, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచి ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొన్నటివరకు ఎమ్మెల్సీగానూ కొనసాగారు. కానీ ఆయనకు మరోసారి ఎమ్మెల్సీగా కంటిన్యూ చేసేందుకు సీఎం చంద్రబాబు ఒప్పుకోలేదు.. దాంతో ఆయన రాజకీయాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. 

Add Zee News as a Preferred Source

వాస్తవానికి 1989లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైంది. దాంతో ఆయన పీఏసీ చైర్మన్ గా క్యాబినెట్ ర్యాంకులో కొనసాగారు. ఆ తర్వాత 2009లో ఓడిపోయారు. ఆ తర్వాత 2014, 19 ఎన్నికల్లో ఆయన తన సోదరుడు కృష్ణుడుని పోటీ చేయించగా ఆయన కూడా ఓడిపోయారు. 2024లో తన కుమార్తె దివ్యను టీడీపీ నుంచి నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆయన సోదరుడు వైసీపీలోకి వెళ్లిపోయారు. మొన్నటివరకు టీడీపీలో ఆయన నెంబర్ 2 గా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా, స్పీకర్, మంత్రి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, శాసనమండలి ప్రతిపక్ష నేత, శాసనమండలి నేత ఇలా ఎన్నో పదవులు నిర్వహించారు. అయితే 2024 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ జీవితం మసకబారింది. అధిష్టానం పట్టించుకోవడం మానేసింది అని నాయకులే చెబుతున్నారు.

ఇక 2024 ఎన్నికల సమయానికి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ల కోటాలో తనకు, లేదా జూనియర్ కోటాలో తన కుమార్తెకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. తొలిసారిగా భంగపాటుకు గురయ్యారు. ఆయన ఎమ్మెల్సీ పదవి గత నెల 29వ తేదీతో ముగిసింది. దీంతో మొన్న ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ సీట్లలో బీసీ కోటాలో తనకు సీనియర్ గా చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆశించారు. కానీ ఎమ్మెల్సీగా కంటిన్యూ చేసేందుకు సీఎం చంద్రబాబు ఒప్పుకోలేదు. అంతేకాదు ఎప్పటినుంచో రాజ్యసభలో అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. అది కూడా ఆయనకు దక్కలేదు. గవర్నర్ పదవి ఇస్తారని ఆయన అనుచరులు ప్రచారం చేసుకున్నారు. అయినా అధిష్టానం పట్టించుకోలేదు. దాంతో ఆయన పార్టీ హైకమాండ్‌ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. 

అయితే దీనికే కారణం లోకేష్ అంటారు రాజకీయ విశ్లేషకులు. లోకేష్ రాజకీయ అరంగేట్రంతో పూర్తిగా పగ్గాలు ఆయన చేతికి వెళ్లిపోయాయి. ఎవరికీ పదవులు ఇవ్వాలి, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి మొత్తం లోకేష్ చూస్తున్నారు. ఆది నుంచి లోకేష్ వ్యవహారంతో యనమలకు గిట్టేది కాదు. దీనికి తోడు యనమల నాడు ఉమ్మడి తూర్పుగోదావరి, నేడు కాకినాడ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా పార్టీ సమావేశాలు, జిల్లా పరిషత్ సమావేశాలు, జిల్లా సమీక్ష సమావేశాలకు వచ్చేవారు కాదు. అడపాదడపా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోయేవారు. మీడియాను కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఇవన్నీ లోకేష్ గమనించారు. పైగా యనమలపై కోపంతోనే అప్పటీలో జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు వంటి వారు పార్టీని వదిలి వెళ్ళిపోయారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. లోకేష్ ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నారు. యనమలను పట్టించుకోవడం మానేశారు అన్నది పార్టీ నేతల టాక్. అలాగే డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యనమల కలిసిన దాఖలాలు కూడా లేవనే చెప్పాలి. 

మొత్తంమీద యనమలకు పదవి రాకపోవడం వెనుక మరో కారణం ఉందంటున్నారు. ఇటీవలే కాకినాడ  స్పెషల్ ఎకనామిక్ జోన్ విషయమై సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ లేఖే యనమలకు పదవి రాకుండా చేసిందని ప్రచారం. ఈ లేఖ విషయంలో సీఎం చంద్రబాబు కనీసం పెదవి విప్పి మాట్లాడలేదు. ఆ లేఖ గురించి ప్రస్తావించలేదు. శాసనమండలి నుంచి రిటైర్ అవుతున్నా సభ్యుల సత్కార కార్యక్రమానికి కూడా ఆయనను పిలవలేదని సమాచారం. దీంతో యనమల రాజకీయ జీవితం ముగిసింది అని ఆయన సోదరుడు, వైసిపి నేత కృష్ణుడు వర్గీయులు చెబుతున్నారు. యనమల రాజకీయ జీవితంపై ఓ పుస్తకం కూడా రాస్తున్నారు. తద్వారా ఆయన ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పేసినట్లేనని చెప్పకనే చెప్పినట్లయింది. తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరించి ఆఖరి క్షణంలో ఆయన అవమానకరంగా తప్పుకున్నారు అన్న ఆవేదన మాత్రం ఆయన సొంత అనుచరుల్లో వ్యక్తం అవుతోంది.

About the Author

G Shekhar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News