న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే నెలలో నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) పరీక్షా ఫలితాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం నీట్ 2018 పరీక్ష ఫలితాలు విడుదల కాగా ఒక్క మార్కు తేడాతో బీహార్‌కు చెందిన కల్పనాకుమారి 691 మార్కులతో ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకును సాధించగా.. తెలంగాణకు చెందిన రోహాన్‌ పురోహిత్‌ 690 మార్కులతో ఆల్‌ ఇండియా రెండో ర్యాంకు సాధించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనిరుథ్‌ బాబు 680 మార్కులతో 8వ ర్యాంకును, తెలంగాణకు చెందిన సిద్దార్థ్‌ రవి 672 మార్కులతో 25వ ర్యాంకు సాధించాడు. ఈ ఫలితాల్లో 2, 25 ర్యాంకులు తెలంగాణ విద్యార్థులు సాధించగా, ఏపీకి చెందినవారు 8, 16, 19, 36వ ర్యాంకులను సాధించారు.


ఎయిమ్స్‌తో పాటు జిప్‌మర్‌ (పుదుచ్చేరి) యూనివర్శిటీలో మినహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్‌ కాలేజీల్లోని ఆయా కోర్సుల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు చేరతారు. మార్కులతో పాటు ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు నిబంధనలు/రిజర్వేషన్ల ప్రకారం ఎంసీఐ యాక్టు కింద సీట్ల కేటాయింపు ఉంటుందని సీబీఎస్‌ఈ పేర్కొంది.


మొత్తం 13,26,725 మంది పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 12,69,922 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. వీరి కోసం 2,255 సెంటర్లను ఏర్పాటు చేశారు. 11 భాషలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయగా, తెలుగులో 1,997 మంది విద్యార్థులు పరీక్షను రాసినట్టు సీబీఎస్‌ఈ తెలిపింది.