Pithapuram Politics: కాకినాడ జిల్లా పిఠాపురంలో కూటమిలో అగ్గిరాజుకుంది. మెగా బ్రదర్ నాగబాబు రెండురోజుల పర్యటనను టీడీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నాయి. ఈ కార్యక్రమంలో వర్మకు జరిగిన అవమానంపై అనుచరులు తీవ్ర స్థాయిలో స్పందించారు. తొలిరోజు అన్న క్యాంటీన్ ప్రారంభానికి వెళ్లిన నాగబాబుకు టీడీపీ కార్యకర్తలు నుంచి చేదు అనుభవం ఎదురైంది. మరుసటి రోజు ఇదే సీన్ రిపీట్ అయ్యింది. పిఠాపురంలో వర్మకు ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు వర్మకు పదవి రాకుండా చేసిన దుర్మార్గం జనసేన నేతలది అంటూ నినాదాలు చేస్తూ నాగబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పిఠాపురంలో వర్మ వర్సెస్ నాగబాబుగా సీన్ మారిపోయింది..
ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మెగా బ్రదర్ నాగబాబు. గతవారమే ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేశారు. పదవి చేపట్టినే తారువాతి రోజే ఆయన పిఠాపురం పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
ఆ తర్వాత గొల్లప్రోలు మండలంలో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో మంచినీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఓపెనింగ్ చేశారు. పంప్ హౌస్ లో మోటార్ల పని తీరును పరిశీలించారు. అనంతరం గొల్లప్రోలు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ని ప్రారంభించి.. మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం దూషించుకున్నారు. జనసేన శ్రేణులు జై జనసేన, జైజై పవన్‌కల్యాణ్ అని నినదిస్తూ టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టారు. దీంతో తామేం తక్కువ కాదంటూ టీడీపీ శ్రేణులు కూడా దీటుగా కౌంటర్ ఇచ్చాయి.
పిఠాపురంలో రెండోరోజు పర్యటించిన ఎమ్మెల్సీ నాగబాబుకు నిరసనలు తప్పలేదు. పర్యటనలో భాగంగా కొత్తగా నిర్మించిన రోడ్లు ను MLC నాగబాబు ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభ కార్యక్రమంలో టీడీపీ నేత వర్మ అనుచరులు హడావిడి చేశారు. జైవర్మ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అందుకు పోటీగా జన సైనికులు జై పవన్, జై జనసేన అంటూ నినాదాలు ఇచ్చారు . అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో టీడీపీ నాయకులు వెనక్కు తగ్గారు. నిన్న, MLC నాగబాబుకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. అయితే పిఠాపురంలో వర్మను అవమానించడానికే నాగబాబు వచ్చారంటూ టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. తమ అండతో గెలుపొంది, ఇప్పుడు అవమానిస్తారా అని ప్రశ్నించారు. అంతేకాదు పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించడం ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్ అయ్యింది..
మొత్తంమీద పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేనగా ఫైట్ జరుగుతోంది. ఎస్వీఎస్‌ఎన్ వర్మకు పదవి రాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో మరో పవర్ సెంటర్ ఉండొద్దనే ఉద్దేశంతోనే వర్మకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ నేతలే టార్గెట్‌గా వర్మ అనుచరులు నిలదీస్తున్నారు. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు పిఠాపురంలో మకాం వేయబోతున్నారని అంటున్నారు. అయితే ఈ విషయం తెలిశాక.. నాగబాబును వర్మ వర్గం అడ్డుకోవడం ఇప్పుడు రెండు పార్టీల మధ్య అగ్గి రాజేసిందని చెబుతున్నారు.









