పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైనశైలిలో ముందుకు కదులుతున్నారు. ఇటు ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీలకు.. అటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమతో కలిసి వచ్చే పార్టీలతో జతకట్టేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలో లక్నో వెళ్లిన పవన్ ఈ రోజు అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌లతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్, పలువురు జనసేన ప్రతినిధులు లక్నోకు వెళినట్లు సమాచారం.
థర్డ్ ఫ్రంట్ కోసమేనా ?
టీడీపీ ఎలాగో కాంగ్రెస్ పక్షాన ఉండటం.. అలాగే ఫ్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ బీజేపీకి పంచన చేరుతుందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న పార్టీలతో జతకట్టి జాతీయ స్థాయిలో మద్దతు తీసుకోవాలనే వ్యూహంతో పవన్ ఈ మేరకు లక్నో పర్యటనకు వెళినట్లు తెలిసింది. ఏపీలో చక్రం తిప్పడంతో పాటు జాతీయ స్థాయిలో కీలక నేతలతో కలిసి ఢిల్లీలోను కీలకంగా మారే ప్రయత్నాలు పవన్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఏపీలో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తోన్న జనసేనాని.. ఏకంగా జాతీయ స్థాయి నేతలతో సమావేశమవుతుండటంపై రాజకీయవర్గాల్లో చర్చనీయంశంగా మారింది. పవన్ రాజకీయ వ్యూహం రాజకీయ వర్గాలకు సైతం అంతుచిక్కడం లేదు.